-

2014 లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు

28 Dec, 2013 19:56 IST|Sakshi

ఢిల్లీ: రాష్ట్ర విభజనపై తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నాటినుంచి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటొంది. తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతం నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత నెలకొంది. విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో డిపాజిట్లు గల్లంతనే ఊహాగానాలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహాలు లేకపోలేదు. అయినా సరే యూపీఏ ప్రభుత్వం 2014 లోక్‌సభ ఎన్నికలపై  కసరత్తును ప్రారంభించింది.
 

ఈ నేపథ్యంలో 2014 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. ఎంపీ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేసింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 42 లోక్‌సభ స్థానాలకు 42 మంది ప్రత్యేక పరిశీలకులను ఏర్పాటు చేశారు. వీరు జనవరి మొదటివారం నుంచి క్షేత్ర స్థాయిలో  42 నియోజకవర్గాల్లో  పర్యటించి కాంగ్రెస్ పార్టీకి ఒక సమగ్రమైన నివేదికను సమర్పిస్తారు. రాష్ట్ర పీసీసీతో సంబంధం లేకుండానే కాంగ్రెస్ అధిష్టానం ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది.

మరిన్ని వార్తలు