రాబోయేది ఇక గడ్డుకాలమే!

18 Mar, 2017 18:05 IST|Sakshi
రాబోయేది ఇక గడ్డుకాలమే!

దేశంలోనే అత్యంత పురాతనమైన పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీకి ముందున్నది కూడా గడ్డుకాలమే అనిపిస్తోంది. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక చోట స్పష్టమైన మెజారిటీ సాధించడంతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీగా నిలిచినా.. ఆ రెండు చోట్ల మాత్రం అధికారాన్ని సాధించలేకపోయింది. మరోవైపు దేశవ్యాప్తంగా మొత్తం 4020 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. వాటిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నవి సరిగ్గా 813 మాత్రమే.. అంటే, మొత్తం వాటిలో 20 శాతం మాత్రమే అన్నమాట. మొత్తం 29 రాష్ట్రాలకు గాను ఆ పార్టీ అధికారంలో ఉన్నది ఏడు చోట్ల మాత్రమే.

అందులోనూ బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీలతో కలిపి మిత్రపక్షంగా అధికారాన్ని పంచుకుంది. నిజానికి అక్కడ మొత్తం 243 నియోజకవర్గాలు ఉంటే, అందులో ఆర్జేడీకి 80, జేడీయూకు 71 రాగా.. వాళ్లిద్దరితో కలిపి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నది కేవలం 27 మాత్రమే. బీజేపీకి అక్కడ 53 స్థానాలు దక్కాయి. అంతే మిత్రపక్షాలన్నింటిలో అత్యంత బలహీనంగా ఉన్నది కాంగ్రెస్సేనన్న మాట. అది కాక పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజొరాం, కర్ణాటక, పుదుచ్చేరిలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. వచ్చే సంవత్సరం కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి అక్కడ సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం ఎంతవరకు నిలబడుతుందన్నది కూడా అనుమానమే. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారు. ఆయన చక్రం తిప్పే అవకాశం ఉంది, దానికి తోడు దేశవ్యాప్తంగా వీస్తున్న మోదీ పవనాలు.. అక్కడ సైతం ప్రభావాన్ని చూపించవచ్చని అంటున్నారు. ఇదంతా చూస్తే ఆ రాష్ట్రం కూడా 'చే'జారిపోతుందేమోనన్న అనుమానాలున్నాయి. అప్పుడు కాంగ్రెస్ బలం మరింత తగ్గుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీకి పార్టీ నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తారా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే పార్టీలో సీనియర్లు.. జూనియర్లు ఎవరు సమర్థులన్న విషయాన్ని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేసినా కూడా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అక్కడ అధికార పార్టీ అయిన సమాజ్‌వాదీతో పొత్తు పెట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. అంతేకాక, పార్టీకి కంచుకోట లాంటి అమేథీలో బీజేపీ తరఫున పోటీ చేసిన గరిమాసింగ్ విజయం సాధించారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అయిన మాజీ మంత్రి గాయత్రీ ప్రజాపతిపై గ్యాంగ్ రేప్ ఆరోపణలు ఉండటం లాంటివి కాంగ్రెస్- ఎస్పీ కూటమి ఓటమికి సగం కారణమయ్యాయి. వాస్తవానికి అమేథీ, రాయ్‌బరేలిలలో అభ్యర్థుల ఎంపిక లాంటి విషయాలను రాహుల్ దగ్గరుండి చూసుకోవాలి. కానీ, అలా చేయకపోవడంతో అమేథీని కోల్పోవాల్సి వచ్చింది.

గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టడానికి అవకాశం ఉన్నా కూడా సరైన సమయంలో కాంగ్రెస్ నాయకత్వం స్పందించకపోవడం సమస్య అయ్యింది. తమకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల సంతకాలు తీసుకుని గవర్నర్‌ను కలిసేంత ధైర్యం కూడా చేయలేకపోవడం తమ పార్టీలో నాయకత్వ లోపాన్ని, నిర్ణయాలు తీసుకోవడంలో అశక్తతను సూచిస్తోందని పార్టీ సీనియర్ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. తాను ఈశాన్య రాష్ట్రాల ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు అక్కడికక్కడే నిర్ణయం తీసుకునేవాడినని, కానీ దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ల వల్లే తాము అధికారానికి దూరమయ్యామని గోవా పీసీసీ చీఫ్ స్వయంగా వ్యాఖ్యానించారు. క్లిష్ట పరిస్థితుల్లో నాయకులకు మార్గదర్శనం చేసే పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రస్తుతం వైద్యపరీక్షల కోసం విదేశాల్లో ఉన్నారు. రాహుల్ కూడా ఆమె వెంటే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తన పూర్వవైభవాన్ని సంతరించుకోడానికి ఇంకెంత కాలం పడుతుందో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు