గోవా మంత్రిపై కాంగ్రెస్‌ ప్రశంసలు

19 Apr, 2017 14:09 IST|Sakshi
గోవా మంత్రిపై కాంగ్రెస్‌ ప్రశంసలు

పణజి: బీజేపీ నేతృత్వంలోని గోవా ప్రభుత్వంలో మంత్రి కొనసాగుతున్న విజయ్‌ సర్దేశాయ్‌ పై కాంగ్రెస్‌ పార్టీ ప్రశంసలు కురిపించింది. విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ)కు ఆయన వార్నింగ్‌ ఇవ్వడాన్ని స్వాగతించింది. తమ సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వీహెచ్‌పీ నాయకులకు ముకుతాడు వేసేందుకు వెనుకాడబోమని సర్దేశాయ్‌ హెచ్చరించడం సాహసోపేతమైన చర్యగా గోవా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ట్రాజానో డీమెల్లో పేర్కొన్నారు. మత సామరస్యాన్ని కోరుకునే వారంతా సర్దేశాయ్‌ ను అభినందించాలని, ఆయన హెచ్చరికలకు మద్దతు తెలపాలని కోరారు. అలజడులకు కారణమవుతున్న వీహెచ్‌పీ లాంటి సంస్థలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం వెనుకాడరాదని సూచించారు.

గోవాలో వచ్చే రెండేళ్లలో బీఫ్‌ వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించకుంటే తామే బాన్‌ చేస్తామని వీహెచ్‌పీ నేత రాధాకృష్ణ మనోహరి ఆదివారం ప్రకటించారు. దీనిపై సర్దేశాయ్ స్పందిస్తూ... వీహెచ్‌పీ నేతలు తమ తీరు మార్చుకోకుంటే శ్రీరామ సేన అధ్యక్షుడు ప్రమోద్‌ ముతాలిక్‌ పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. గోవాలో అడుగుపెట్టకుండా ముతాలిక్‌ పై గతంలో నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు