370 అధికరణపై రగడ

3 Dec, 2013 02:07 IST|Sakshi
370 అధికరణపై రగడ
  •  ‘సంఘ్’తో చర్చించండి: మోడీకి దిగ్విజయ్ సలహా
  •  రాజ్యాంగం తెలియదు: ఒమర్ అబ్దుల్లా
  •  మార్చాల్సిన పనిలేదు: ముఫ్తీ మహమ్మద్
  •  మోడీ అన్నదాంట్లో తప్పేముంది: బీజేపీ
  • న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణపై చర్చ జరగాలన్న నరేంద్రమోడీ పిలుపు రాజకీయాల్లో దుమారం సృష్టించింది. పలు ప్రధానపార్టీలతో పాటు, కాశ్మీర్ వేర్పాటువాద పార్టీలు మోడీ సూచనను తప్పుపట్టాయి.అయితే బీజేపీ మాత్రం తమ నేతను పూర్తిగా సమర్థించింది. మోడీ సూచనను అటు కాంగ్రెస్ పార్టీ,ఇటు నేషనల్ కాన్ఫరెన్స్,పీడీపీ, సీపీఎంలు  తోసిపుచ్చాయి. ఆ అధికరణపై మొదట రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)తో చర్చించాలని కాంగ్రెస్ పార్టీ మోడీకి సలహా ఇవ్వగా, మోడీకి రాజ్యాంగం తెలియదని కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విమర్శించారు.కాగా మోడీ సూచనకు వక్రభాష్యం చెప్పరాదని పార్లమెంట్‌లో ప్రతిపక్షనేతలు సుష్మాస్వరాజ్,అరుణ్ జైట్లీలు వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 370పై  కాంగ్రెస్‌కు పూర్తి స్పష్టత ఉందని చెప్పారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి ప్రతిచోట అన్నీ అవాస్తవాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. చారిత్రక సంఘటనలపై మోడీవన్నీ అబద్ధాలని, వాటిని తాము సీరియస్‌గా పరిగణించడంలేదని దిగ్విజయ్ అన్నారు. అయితే, జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370పై జనంలో చర్చ జరిగితే తమకు అభ్యంతరంలేదన్నారు.కాని మోడీ ముందుగా సంఘ్‌తో ఈ విషయం చర్చించాలన్నారు. కాశ్మీర్‌కు ఆ అధికరణతో ఏమైనా ప్రయోజనం ఉంటే దానిని కొనసాగించడానికి తమకు అభ్యంతరం లేదని, ఆర్టికల్ 370 కారణంగా రాష్ట్ర మహిళలకు సమాన హక్కులు లేవని మోడీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.


     ఇదిలా ఉండగా మోడీ  ప్రకటనను కేంద్రమంత్రి మనీశ్ తివారి తిరస్కరించారు.బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని చదవరని,దానిని పట్టించుకోరని ఆయన విమర్శించారు.బీజేపీది రెండు నాల్కల ధోరణి అని ఆయన ఆరోపించారు.ఇన్నాళ్లు ఆర్టికల్ 370ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేసిన సంగతిని మనీశ్ గుర్తు చేశారు.కాగా, మోడీ చేసిన ప్రకటనను పీడీపీ,సీపీఎంలు కూడా తప్పుపట్టాయి.లేని సమస్యను మోడీ లేవనెత్తుతున్నారని ఆ పార్టీలు ఆరోపించాయి. తమ రాష్ట్రానికి స్వతంత్ర చట్టాలున్నాయని, వాటిని కొనసాగనివ్వాల్సిందేనని కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రత్యేక ప్రతిపత్తి తమకు ఉండాల్సిందేనని పీడీపీ నేత ముఫ్తీమహమ్మద్ సయీద్ తెలిపారు. 370 అధికరణ అనేది మిగిలిన దేశానికి, కాశ్మీర్‌కు మధ్య వారధి లాంటిదని ఆయన అన్నారు.
     

>
మరిన్ని వార్తలు