-

కూటమి కుదిరింది.. పంపకాలకు తెరలేచింది!

12 Mar, 2016 03:15 IST|Sakshi
కూటమి కుదిరింది.. పంపకాలకు తెరలేచింది!

చెన్నై, సాక్షి ప్రతినిధి: కూటమి ఖరారు కావడంతో కాంగ్రెస్, డీఎంకేలు సీట్ల పంపకాలకు సిద్ధమయ్యాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనేదానిపై డీఎంకే సమాలోచనలు సాగిస్తుండగా, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం కోసం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఢిల్లీ విమానం ఎక్కారు. డీఎండీకే కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన డీఎండీకే, కాంగ్రెస్‌లను విజయకాంత్ ఖంగుతినిపించడంతో రెండు పార్టీల్లోనూ ఎన్నికల పనులు వేగం పుంజుకున్నాయి. డీఎండీకేను డీఎంకే కూటమిలోకి తెచ్చే బాధ్యత మీదేనంటూ కాంగ్రెస్‌పై కరుణానిధి భారం మోపారు.

డీఎండీకే కోసం తమ సీట్లు త్యాగం చేసేందుకు కూడా సిద్ధమని కాంగ్రెస్ ప్రకటించింది. డీఎండీకే తమతో కలవడం ఖాయమని కాంగ్రెస్, డీఎంకేలు గట్టిగా నమ్మాయి. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా సీట్ల సర్దుబాట్లను వాయిదావేసుకుంటూ వచ్చాయి. డీఎంకే, డీఎండీకే, కాంగ్రెస్‌లకు తలా ఇన్ని సీట్లు అంటూ నిర్ణయాలు జరిగినట్లు పుకార్లు షికారు చేశాయి.

పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుపెట్టుకుని నష్టపోయిన విజయకాంత్‌కు డీఎంకేనే ప్రత్యామ్నాయమని ధీమాతో కొనసాగాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయకాంత్ ఒంటరిబాట పట్టారు. చేసేదిలేక కాంగ్రెస్, డీఎంకేలు సీట్ల పంపకాల పనిలోకి నిమగ్నమయ్యాయి. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ మాత్రమే ప్రధాన పార్టీ కావడంతో సీట్ల సర్దుబాట్లు సులభంగా సాగుతుందని ఆశిస్తున్నారు.
 
బృందం రెడీ
గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల నుంచి పోటీకి దిగింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నుంచి కాంగ్రెస్  50 సీట్లను ఆశిస్తోంది. పంపకాల్లో కనీసం 45 సీట్లయినా దక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. సీట్ల పంపకాలపై ఒక బృందాన్ని సిద్ధం చేసుకుంది. ఆశిస్తున్న సీట్ల సంఖ్యపై అధిష్ఠానం ఆమోద ముద్ర కోసం ఈవీకేఎస్ ఇళంగోవన్ అకస్మాత్తుగా శుక్రవారం ఢిల్లీకి పయనమయ్యారు. అయితే ఈసారి కాంగ్రెస్ కోరినన్ని సీట్లు దక్కక పోవచ్చని తెలుస్తోంది. అలాగే ఇళంగోవన్ ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రత్యేకవాహనాన్ని సిద్ధం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు