-

సీఎం రాజీనామాపై కోర్‌కమిటీ చర్చ!

19 Feb, 2014 08:28 IST|Sakshi
సీఎం రాజీనామాపై కోర్‌కమిటీ చర్చ!

న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా సంకేతాలపై కాంగ్రెస్ కోర్‌కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది. కిరణ్ రాజీనామా చేస్తే ఏం చేయాలనే అంశంపై కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. లోక్‌సభలో మంగళవారం రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం అనంతరం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్‌సింగ్, రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, ఏకే ఆంటోనీ తదితరులు సమావేశమయ్యారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం కోసం అనుసరించాల్సిన వ్యూహంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలపైనా వారు చర్చించినట్లు తెలిసింది.
 
  మరోవైపు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం తన పదవికి రాజీనామా చేస్తారని సంకేతాలు అందడంతో ఈ అంశంపైనా వారు చర్చించినట్లు తెలిసింది. కొత్త ముఖ్యమంత్రిని నియమించాలా? లేక రాష్ట్రపతి పాలన విధించాలా? అనే అంశంపై మల్లగుల్లాలు పడినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో బిల్లు ఆమోదం అనంతరం రాష్ట్రపతి వద్దకు బిల్లు వెళుతున్నందున ఈ నెలాఖరులోగా గెజిట్ వెలువడే అవకాశ ం ఉందని, అదే సమయంలో వచ్చే నెల తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై కోర్‌కమిటీ చర్చించినట్లు తెలిసింది.

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు రాష్ట్రపతి పాలన విధించాలా? లేక ప్రభుత్వాన్ని కొనసాగించి కొత్త ముఖ్యమంత్రిని నియమించాలా? అనే అంశంపై కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసిన తరువాతే తన నిర్ణయాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమైనట్లు తెలిసింది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సమావేశమై సీఎం రాజీనామా, పార్టీలో  పరిణామాలు, వ్యవహరించాల్సిన తీరుపై చర్చించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు