ఉద్యమాన్ని నీరుగార్చేందుకే.. : ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌... సేవ్‌ కాంగ్రెస్‌’

2 Oct, 2013 02:07 IST|Sakshi
ఉద్యమాన్ని నీరుగార్చేందుకే.. : ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌... సేవ్‌ కాంగ్రెస్‌’

‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ ఆంతర్యమదే  కాంగ్రెస్‌ వర్గాల స్పష్టీకరణ సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ విభజన అనుకూల చర్చకు యత్నం
అధిష్టానం వద్ద క్రెడిట్‌ కొట్టేయడానికి ఆధిపత్య పోరు షురూ
సీఎం కిరణ్‌కు చెక్‌ పెట్టేందుకు తెరపైకి చిరంజీవిని తెచ్చారు!

 సాక్షి, హైదరాబాద్‌: ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌... సేవ్‌ కాంగ్రెస్‌’ - కాంగ్రెస్‌ కొత్తగా ఎత్తుకుంటున్న నినాదమిది. సమైక్య ఉద్యమం తీవ్రంగా సాగుతున్న తరుణంలో దాన్ని చల్లార్చి ప్రజల్లోకి వెళ్లాలని ఆ పార్టీ రచిస్తున్న వ్యూహంలో భాగంగా ఈ కొత్త నినాదంతో ముందుకొస్తున్నారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు పార్టీ పెద్దలు తెరవెనుక మరో కొత్త నాటకానికి తెరతీస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 మైక్యాంధ్రప్రదేశ్‌ అని కాకుండా ప్రజల్లోకి వెళ్లేందుకు వారు ఎంచుకున్న ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ నినాదంలోనే సమైక్య వ్యతిరేక భావన దాగి ఉందని చెప్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత కూడా సీమాంధ్రను ఆంధ్రప్రదేశ్‌గానే పరిగణిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానించిందని, అక్కడి సమస్యలను తీర్చి దాన్ని పరిరక్షించాలన్నదే కాంగ్రెస్‌ నేతల కొత్త నినాదం ఆంతర్యమని తేలుతోంది. మంగళవారం ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో జరిగిన సీమాంధ్ర మంత్రుల సమావేశం పలురకాల చర్చలకు తావిస్తోంది. సీఎం తీరుపై ఇతర నేతల్లో ఆగ్రహం... రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం తరువాత సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుండడంతో కాంగ్రెస్‌ నేతలెవ్వరూ ఆ ప్రాంతంలో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. పది రోజుల తరువాత… సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యవాదిగా తెరపైకి వచ్చే ప్రయత్నం చేశారు. పార్టీ కోర్‌ కమిటీ, సీడబ్ల్యూసీ సమావేశాలకు ముందు మౌనంగా ఉండి విభజన వల్ల తలెత్తే సమస్యలంటూ మీడియా ముందు ఏకరువుపెట్టారు. అయితే సీమాంధ్రలో పరిస్థితులు చేజారిపోతుండడంతో అధిష్టానమే ఇలా సీఎంతో మాట్లాడించిందన్న అనుమానాలు ఏర్పడ్డాయి.

సమైక్య ఉద్యమం ప్రారంభమై అరవై రోజుల తరువాత కొద్ది రోజుల ముందు సీఎం మళ్లీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కాంగ్రెస్‌ అధినాయకత్వం వ్యూహాత్మకంగానే సీమాంధ్ర నేతలందరినీ కలుపుకుని ఆ రకంగా మాట్లాడాలని చెప్తే సీఎం ఒక్కరే తానే చాంపియన్‌ అన్న రీతిలో మాట్లాడటంపై మిగిలిన నేతల్లో ఆగ్రహం తెప్పించింది. వ్యూహాత్మకంగా వ్యవహరించి సీమాంధ్ర ఉద్యమాన్ని చల్లార్చే విధంగా చూస్తానని అధిష్టానం ముందు చెప్పిన సీఎం ఒక్కడే అధిష్టానం దృష్టిలో పడుతున్నారని గమనించిన నేతలు ఆధిపత్య పోరులో అప్రమత్తమయ్యారు. ఆనం రామనారాయణరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సీమాంధ్ర మంత్రులతో గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న సమావేశాలు కాంగ్రెస్‌ పెద్దల తాజా ఆలోచనల మేరకేనని తెలుస్తోంది. చిరంజీవిని ఈ సమావేశాల ద్వారా తెరపైకి తెచ్చి సీఎం కిరణ్‌కు చెక్‌ పెట్టించడంతో పాటు ‘సేవ్‌ ఆంధ్రప్రదే శ్‌ - సేవ్‌ కాంగ్రెస్‌’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకోవచ్చన్న ఆలోచనతో పార్టీ పెద్దలు ఉన్నట్లు కనిపిస్తోందని కాంగ్రెస్‌ నేతలు విశ్లేషిస్తున్నారు.

సమైక్య ఉద్యమాన్ని చల్లార్చి విభజనకు అనుకూలంగా ఉద్యమకారుల ఆలోచనలు మారేలా కాంగ్రెస్‌ నేతలు వ్యూహాన్ని అమల్లో పెట్టాలని భావిస్తున్నారు. తమ భేటీ కిరణ్‌కు వ్యతిరేకంగా కాదన్న ఆనం సీఎం కిరణ్‌కు వ్యతిరేకంగా ఈ సమావేశాన్ని పెట్టినట్లు బయట ప్రచారం జరగ్గా మంత్రి ఆనం దాన్ని ఖండించారు. సీఎం ఆలోచనల మేరకే తాము వివిధ సమస్యలపై చర్చించి వాటికి పరిష్కారం చూపించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంతో చర్చించే బాధ్యతలను కేంద్రమంత్రి చిరంజీవికి, పీసీసీ అధ్యక్షుడు బొత్సకు అప్పగించినట్లు ఆనం విలేకరులకు చెప్పారు.

సీమాంధ్ర మంత్రుల్లో చీలిక...
రాష్ట్ర విభజన ప్రక్రియను సాఫీగా పూర్తి చేయడానికి అధిష్టానం వ్యూహం అమలుచేయటంలో ఆధిపత్య పోరుతో మంత్రుల్లో విభేదాలు తీవ్రస్థాయికి చేరినట్టు చెప్తున్నారు. మరోవైపు విభజన సమస్యలను లేవనెత్తి వాటిని పరిష్కరించాకనే కేంద్రం ముందుకు వెళ్లాలంటూ అధిష్టానాన్ని ప్రశ్నించిన మాదిరిగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలతో అధిష్టానమే చీలికను ప్రోత్సహిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సీనియర్‌ మంత్రులను కూడా ఇదే పనిలో దించింది. బొత్స, ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి తదితరులు కూడా సీఎంకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మంత్రులతో మాట్లాడుతూ వారిని తమ వర్గంలోకి తెచ్చుకుంటున్నారు. సీఎం అనుకూల వర్గంగా ముద్రపడ్డ మంత్రి కొండ్రు మురళి కూడా ఆనం నివాసంలో జరిగిన సమావేశానికి హాజరవటం విశేషం. ఇక్కడ సమావేశం జరుగుతున్న సమయంలోనే మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో మరో భేటీ జరిగింది. గంటాతో పాటు మంత్రి శైలజానాథ్‌, ఎంపీ లగడపాటి ఇందులో పాల్గొన్నారు. దీంతో ఈ రెండు భేటీలపై సీఎం అనుకూల, వ్యతిరేక గ్రూపుల సమావేశంగా మీడియాలో ప్రచారమైంది. అయితే తాము అనుకోకుండా కలిశామని, లగడపాటి కూడా యథాలాపంగా అక్కడికి వచ్చారే తప్ప సమావేశం కావడానికి కానేకాదని ఒక మంత్రి పేర్కొన్నారు.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా