మరణశిక్షకు ముందు క్షమాపణలు

7 Oct, 2015 09:00 IST|Sakshi
మరణశిక్షకు ముందు క్షమాపణలు

వాషింగ్టన్: విచారణలో ఉన్నంత సేపు తనకు క్షమాపణ భిక్ష పెట్టాలని కోరిన హంతకుడు మరణ శిక్ష అమలుగడువు సమీపిస్తుండగా మాత్రం మిన్నకుండిపోయాడు. పైగా తన వల్ల నష్టపోయిన కుటుంబానికి క్షమాపణలు తన చివరి మాటలుగా చెప్పాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తిని దోపిడి చేసి అనంతరం హత్య చేసిన హంతకుడికి టెక్సాస్లో మరణ శిక్ష విధించారు. శిక్ష అమలుచేసే సమయానికి అతడి నుంచి ఎలాంటి పిటిషన్ రాకపోవడంతో శిక్షను అమలు చేశామని జైలు అధికారులు చెప్పారు. టెక్సాస్లో ఈ ఏడాదిలో ఇది 11వ మరణ శిక్ష. జువాన్ గార్సియా(35) అనే వ్యక్తి 1998లో ఓ వ్యక్తిపై దాడికి దిగి అతడి వద్ద నుంచి ఎనిమిది డాలర్లను లాగేసుకున్నాడు. అనంతరం అతడిపై కాల్పులు జరపడంతో బాధితుడు చనిపోయాడు.

ఈ కేసులో పోలీసులు గార్సియాను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. అయితే, కేసు విచారణ ప్రారంభంలో పలుమార్లు తనకు క్షమా భిక్ష పెట్టాల్సిందిగా పిటిషన్లు పెట్టుకున్న గార్సియా ఉరి తీసే సమయంలో మాత్రం ఎలాంటి కోరిక కోరుకోకపోవడం విశేషం. పైగా తన నేరాన్ని అంగీకరించి, తాను హత్య చేసిన వ్యక్తి భార్యకు, కుమారుడికి తన తరుపున క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన పని చిన్నదేం కాదని, దాదాపు వారి జీవితానికి పెద్ద ముగింపుపలికే ప్రయత్నమేనని అన్నాడు. అనంతరం అతడికి లీథల్ ఇంజెక్షన్(ప్రాణంతీసే విషం)తో మరణ శిక్ష విధించారు. టెక్సాస్లో ప్రస్తుతం లీథల్ ఇంజెక్షన్ల కొరత ఏర్పడిందట.

మరిన్ని వార్తలు