భూతాపంపై యుద్ధం

30 Nov, 2015 04:08 IST|Sakshi
భూతాపంపై యుద్ధం

భూతాపం పెరుగుతోంది.. ప్రకృతి ప్రకోపిస్తోందనే ప్రకటనలే తప్ప ఇన్నాళ్లూ ఈ దిశగా ప్రపంచ దేశాలు చేసిన ప్రయత్నం తక్కువే. దీంతో ఏడాదికేడాది వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయే తప్ప సానుకూల ఫలితాలు వస్తున్న దాఖలాలే కనిపించటం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో యాభై ఏళ్లలో ప్రపంచ చిత్రపటమే మారిపోనుంది. ఈ నేపథ్యంలో.. మారుతున్న వాతావరణ పరిస్థితులపై సమరశంఖం పూరించేందుకు ప్రపంచం సిద్ధమైంది. నేటినుంచి పారిస్‌లో జరగనున్న కాప్-21 సదస్సులో భారీ నిర్ణయాలు తీసుకునేందుకు ఐక్యరాజ్యసమితి ఏర్పాట్లు చేసింది.

ఇకపై ప్రపంచదేశాలు వేసే ప్రతి అడుగూ పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకునే వేసేలా పలు ఒప్పందాలకు రూపకల్పన జరగనుంది. ఈ పారిస్ సదస్సు ప్రత్యేకతలు, లక్ష్యాలు, భారత్ పాత్ర వంటి అంశాలను ఓసారి గమనిస్తే..
* పర్యావరణ మార్పుపై పారాహుషార్!
* నేటి నుంచి పారిస్‌లో కాప్-21

 
కాప్ - 21 అంటే?
కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ను క్లుప్తంగా కాప్ అని పిలుస్తారు.  ప్రస్తుతం పారిస్‌లో జరుగుతున్నది 21వ సదస్సు. దాదాపు 190 దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సులో (ఒక్కో దేశం ఒక్కో పార్టీ అన్నమాట) భూతాపోన్నతి ప్రభావంతో వాతావరణ మార్పుల రూపంలో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని నివారించే చర్యలపై అంతర్జాతీయ స్థాయిలో ఓ ఒప్పందం జరగనుంది. నవంబరు 30వ తేదీ నుంచి డిసెంబరు 11వ తేదీ వరకూ ఈ సదస్సు జరగనుంది.
 
ఎందుకు ఇంత ప్రాముఖ్యత?
ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అకాల వర్షాలు, వరదలు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులోనూ.. ఈ సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్లకోసారి కాప్ సదస్సు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ జరిగిన సదస్సులు ఒక ఎత్తై.. ఫ్రాన్స్‌లో జరగనున్న ఈసారి కాప్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే..

ఈ సదస్సులో 2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రత రెండు డిగ్రీల కంటే ఎక్కువగా పెరగకుండా ఉండేం దుకు ఏం చేయాలనే దానిపై 190 దేశాల ప్రతినిధుల మధ్య కీలకమైన ఒప్పందం జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న ఈ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత కూడా చాలా ప్రమాదకరమే. చాలా దేశాలు, పెద్ద దేశాల్లోనూ తీర ప్రాంతాల్లోని కీలక పట్టణాలు కనుమరుగయ్యేందుకు ఇది కారణం కానుంది.

ఇది తమను తీవ్రంగా నష్టపరుస్తుందని, దేశాలకు దేశాలు సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉందని కొన్ని చిన్న ద్వీప దేశాల అధినేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఏ లక్ష్యానికి కట్టుబడతాయి? అగ్రరాజ్యాలు కొత్త ఒప్పందం సక్రమంగా అమలయ్యేందుకు ఎంతమేరకు ఆర్థిక సహకారం అందిస్తాయన్నది ఈ సదస్సులో కీలకం కానుంది.
 
సదస్సు సాధించేదేమిటి?
అంతర్జాతీయంగా అన్ని దేశాలు చట్టపరంగా కట్టుబడే ఒప్పందాన్ని రూపొందించాలన్నది ఈ సదస్సు లక్ష్యం. గత కాప్ సదస్సులతో పోలిస్తే ఈ సదస్సు మరింత అర్థవంతంగా జరుగుతుందనేందుకు ఈ లక్ష్యం ఒక ఉదాహరణ. అన్ని దేశాల మధ్య ఇలాంటి ఓ భారీ ఒప్పందం జరిగే విధంగానే ఐక్యరాజ్యసమితి ఏర్పాట్లు చేసింది.  తొలిరోజు నుంచి దేశాధినేతలందరూ సదస్సుకు హాజరయ్యేలా చేయడం ఇందులో భాగమే.
 
మన పరిస్థితి ఏమిటి?
పారిస్ సదస్సులో మరో ముఖ్య భాగం ‘ఇన్‌టెండెడ్ నేషనల్లీ డిటర్‌మైండ్ కంట్రిబ్యూషన్స్’ (ఐఎన్‌డీసీ). అంశం. సదస్సులో పాల్గొనే  దేశాలు తమతమ  స్థాయిలో కర్బన ఉద్గారాలను ఎంత శాతం మేరకు  తగ్గించుకుంటాయన్నది ఐఎన్‌డీసీ ద్వారా వెల్లడవుతుంది. భారత్ గత నెల మొదటి వారంలో ఐక్యరాజ్యసమితికి తన ఐఎన్‌డీసీ లక్ష్యాల పూర్తి వివరాలను సమర్పించింది. వాటి  ప్రకారం 2030 నాటికల్లా కర్బన ఉద్గారాలను 33 నుంచి 35 శాతం వరకూ తగ్గించుకుంటామని భారత్ తెలిపింది.

ఇది 2005 సంవత్సర నాటి స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా నిర్ణయమవుతుంది. ఈ క్రమంలో 2030 నాటికి దేశంలోని మొత్తం విద్యుదుత్పత్తిలో 40 శాతం సౌర, పవన వంటి సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా జరిగేలా చూస్తామంటూ ఐరాసకు  హామీ ఇచ్చింది.

మరిన్ని వార్తలు