సంచలనం: పోలీస్‌ Vs ఆర్మీ

22 Jul, 2017 17:21 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులు

శ్రీనగర్‌: కల్లోల కశ్మీర్‌లో కలిసి పనిచేయాల్సిన సైనికులు, పోలీసులు కొట్లాటకు దిగడం సంచలనంగా మారింది. నిషేధిత సమయంలో, అదికూడా సివిల్‌ డ్రెస్‌లో ప్రయాణిస్తున్న ఆర్మీ జవాన్లను అడ్డుకున్న పాపానికి పోలీసులపై దాడి జరిగింది. జమ్ముకశ్మీర్‌లోని గందర్బల్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుందీ ఘటన.

అమర్‌నాథ్‌ యాత్ర డ్యూటీ ముగించుకున్న కొందరు ఆర్మీ జవాన్లు బల్తాల్‌ బేస్‌ క్యాంపు నుంచి ప్రైవేటు వాహనాల్లో గుండ్‌వైపునకు ప్రయాణమయ్యారు. సోనామార్గ్‌ చెక్‌పోస్ట్‌ వద్ద కాపలా ఉన్న జమ్ముకశ్మీర్‌ పోలీసులు.. ఆ వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆర్మీ జవాన్లు వాహనాన్ని వేగంగా పోనిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. సమీపంలోని గుండ్‌ పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం చేరవేశారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఉంచి, ఎట్టకేలకు ఆర్మీ జవాన్ల వాహనాలు ఆపేశారు.

దీంతో ఆగ్రహించిన జవాన్లు.. ‘ఆర్మీవాళ్లనే అడ్డుకుంటారా?’ అంటూ పోలీసులతో వాదనకు దిగారు. గుండ్‌పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోని ఆర్మీ క్యాంపు నుంచి మరికొంత మంది జవాన్లను పిలిపించారు. అందరూ కలిసి పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేశారు. స్టేషన్‌లోకి చొరబడి, సామాగ్రిని, రికార్డులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి.

అధికారుల పాట్లు.. నేతల ట్వీట్లు
కాగా, పోలీసులపై ఆర్మీ జవాన్ల దాడి ఘటనను చిన్నదిగా చూపేందుకు అటు ఆర్మీ, పోలీసు వర్గాలు ప్రయత్నించాయి.  కానీ దెబ్బలు తిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసుల ఫొటోలు మీడియాలో ప్రసారం కావడంతో చర్యలకు ఉపక్రమించాయి. దాడికి పాల్పడిన ఆర్మీ జవాన్లపై కేసు నమోదు చేశామని, సైనిక పరంగానూ వారిపై విచారణకు ఆదేశాలు జరీ అయ్యాయని జమ్ముకశ్మీర్‌ ఐజీ మునీర్‌ అహ్మద్‌ ఖాన్‌ మీడియాకు తెలిపారు. జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఈ ఘటనపై స్పందించారు. రాష్ట్రపోలీసులపై ఆర్మీ దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు