ఫలితాలు, ఐఐపీపై దృష్టి

6 Jan, 2014 01:40 IST|Sakshi
ఫలితాలు, ఐఐపీపై దృష్టి
  • స్టాక్ మార్కెట్లపై నిపుణుల అంచనాలు
  •    ఈ నెల 10న ఇన్ఫోసిస్ క్యూ3 ఫలితాలు
  •    విదేశీ సంకేతాలూ ప్రభావం చూపుతాయ్
  •    రూపాయి కదలికలకూ ప్రాధాన్యం
  •  న్యూఢిల్లీ: కంపెనీలు ప్రకటించనున్న క్యూ3 (అక్టోబర్-డిసెంబర్) ఫలితాలు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్ల ట్రెండ్‌పై ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌తో ఈ నెల 10(శుక్రవారం) నుంచి ఫలితాల సీజన్ మొదలుకానుంది. అదే రోజున డిసెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) వివరాలతోపాటు క్యూ3కు ఇండస్‌ఇండ్ బ్యాంక్ పనితీరు సైతం వెల్లడికానుంది. ఈ బాటలో జనవరి 13న(వచ్చే సోమవారం) టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. కాగా, ఈ నెల 28న క్యూ3కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్షను చేపట్టనుంది. పరపతి విధానాల సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఐఐపీ, డబ్ల్యూపీఐ తదితర గణాంకాలకు ప్రాధాన్యత ఇచ్చే విషయం తెలిసిందే. డబ్ల్యూపీఐ గరిష్ట స్థాయిల్లో కొనసాగుతుండగా, పారిశ్రామికోత్పత్తి నీరసిస్తున్న విషయం విదితమే. వెరసి పాలసీ సమీక్షలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలను కొట్టిపారేయలేమని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.
     
     6,250 పాయింట్లు కీలకం...
     కంపెనీల క్యూ3 ఫలితాలతోపాటు, విదేశీ సంకేతాలు కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. కంపెనీల ఫలితాలను మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తాయని తెలిపారు. ఈ వారంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి 6,250 పాయింట్ల స్థాయి కీలకంగా నిలవనున్నదని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. సమీప కాలంలో ఈ స్థాయికి ఎగువన కొనుగోళ్లు పుంజుకుంటాయని అంచనా వేశారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులతోపాటు, డాలరుతో రూపాయి మారకం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు వంటి అంశాలు ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని అత్యధిక శాతం మంది నిపుణులు అభిప్రాయపడ్డారు.
     
     సాంకేతికంగా నిఫ్టీ బులిష్...: చార్టుల ప్రకారం నిఫ్టీ సాంకేతికంగా బుల్లిష్‌గా ఉన్నదని క్యాపిటల్‌వయాగ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా వివరించారు. రానున్న సెషన్లలో నిఫ్టీ 6,270 పాయింట్లను అధిగమిస్తే 6,380కు చేరుతుందని అంచనా వేశారు. ఆపై 6,455 వద్ద అమ్మకాలు ఎదురుకావచ్చునని(రెసిస్టెన్స్) అభిప్రాయపడ్డారు. గతంలో జరిగిన పలు అంశాల ఆధారంగా చూస్తే జనవరి-ఫిబ్రవరి కాలం మార్కెట్లకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచే అవకాశమున్నదని ఇన్వెంచర్ గ్రోత్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ మిలన్ బవిషీ చెప్పారు. ఈ కాలంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించాల్సి ఉన్నదని వ్యాఖ్యానించారు. కొత్త ఏడాది సెలవులు ముగిసిన వెంటనే మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముందన్నారు. అయితే గతవారంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 342 పాయింట్లు క్షీణించి 20,851 వద్ద ముగిసింది.  
     
     ఎఫ్‌ఐఐల పెట్టుబడి రూ. 1,009 కోట్లు
     దేశీయ స్టాక్స్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు కొనసాగుతున్నాయి. జనవరి తొలి వారంలో నికరంగా రూ. 1,009 కోట్లను(16.3 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. ఈ నెల నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ అమలు చేస్తున్న 85 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీలో 10 బిలియన్ డాలర్లమేర కోతపడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఐఐల పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా, సెబీ గణాంకాల ప్రకారం జనవరిలో డెట్ మార్కెట్లోనూ ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 1,746 కోట్లను ఇన్వెస్ట్ చేయడం విశేషం!

>
మరిన్ని వార్తలు