అడుగడుగునా దగా పడ్డాం!

11 Sep, 2015 02:25 IST|Sakshi
అడుగడుగునా దగా పడ్డాం!

* కార్పొరేటు వైద్యంపై జనాగ్రహం
* ‘సాక్షి’ వరుస కథనాలకు విశేష స్పందన
* కార్పొరేట్ ధనదాహానికి అంతులేదని ఆవేదన
* అవసరం లేకున్నా ఆపరేషన్లు, టెస్టుల పేరుతో జేబులు ఖాళీ చేస్తున్నారని ధ్వజం
* వైద్యుల అనైతిక పోకడలపై మండిపాటు

 
సాక్షి ప్రత్యేక బృందం: అప్పుడే పుట్టి... మూడు ఆసుపత్రులు మారిన పసిపాప.. ధనదాహానికి బలై వెంటిలేటర్‌పై పడి ఉంది..! పరీక్షలంటూ 9 నెలల పాటు ఓ ఆసుపత్రి చేసిన నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణమే పోయింది! గుండె ఎన్‌లార్జ్ అయిందని అనవసర పరీక్షలు, చికిత్సతో ఆరు నెలలు లాగించేసింది మరో ఆసుపత్రి. యాక్సిడెంటయి ఆసుపత్రిలో చేరితే పరీక్షలకే రూ.40 వేలు గుమ్మరించిన ఓ పేద కుటుంబం.. ఆ కార్పొరేట్ ఆసుపత్రి డిమాండ్ చేసిన రూ.5 లక్షలు ఇవ్వలేక నిస్సహాయంగా వెనుదిరిగింది.
 
 ఇలా చెప్పుకుంటూ పోతే.. వీటికి అంతుండదు. ‘వైద్య విధ్వంసం’ శీర్షికతో కొన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల అనైతిక విధానాలపై ‘సాక్షి’ ప్రచురిస్తున్న కథనాలకు పాఠకుల నుంచి వచ్చిన స్పందన చూస్తే... బాధితుల వేదన ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. వీటన్నిటినీ చూస్తే.. కోట్ల రూపాయలు కేవలం డొనేషన్ల రూపంలోనే గుంజే ప్రైవేటు మెడికల్ కాలేజీల దగ్గర మొదలయ్యే ఈ ధనదాహం.. అక్కడ్నుంచి కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు, బీమా సంస్థలు... ఇలా వైద్యం రంగంలో భాగమయ్యే ఏ ఒక్కదాన్నీ వదిలిపెట్టలేదన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఇంజెక్షన్లు తప్ప మరో చికిత్స లేని ఒక రకమైన కేన్సర్‌కు... రూ.2,65,000 ఖరీదు చేసే ఇంజెక్షను నెలకోసారి ఇవ్వాలని ఓ ఆసుపత్రి చెబితే... మరో మంచి వైద్యుడు దాన్ని నేరుగా రూ.1,95,000కు డీలర్ నుంచి తెప్పించి ఇచ్చాడంటే ఏమనుకోవాలి? ఒక్కో ఇంజెక్షన్‌పై ఏకంగా రూ.75 వేలు లాభమంటే అది ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?  కొన్ని మందుల షాపులు వెయ్యి రూపాయల మందులపై 30 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాయంటే అసలు మందులపై ఎంత లాభం ఉందనుకోవాలి? ఇవన్నీ ఇలాగే కొనసాగితే ఇక సామాన్యుడికి వైద్యమెక్కడ అందుతుంది?
 
 పెద్దఎత్తున స్పందన..
 ‘కాసు’పత్రులపై అర్థవంతమైన చర్చ జరిగేలా కలసి రండంటూ ‘సాక్షి’ ఇచ్చిన పిలుపునకు స్పందనగా ప్రజల నుంచి పెద్దఎత్తున ఈ-మెయిళ్లు, లేఖలు వెల్లువెత్తాయి. పలువురు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేయగా... ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సమస్యల్ని కొందరు ప్రస్తావించారు. దాదాపు అందరూ ఏ ఆసుపత్రిలో ఎలా మోసపోయారో వివరించారు. అయితే తమ వైద్యంతో మన్ననలు అందుకుని, ‘వైద్యోనారాయణో హరి’ నానుడిని నిజం చేసిన మంచి డాక్టర్ల గురించి కూడా కొందరు ప్రస్తావించారు. నిజానికి చికిత్సలో అనైతిక కార్యకలాపాలనేవి చాలా ఆసుపత్రుల్లో కొనసాగుతున్నాయి. లేఖ లు రాసినవారు తమకు సంబంధించిన కొన్ని ఆసుపత్రుల్నే ప్రస్తావించారు. దానర్థం మిగతావన్నీ సచ్ఛీలమైనవని కాదు. అలాగే కొందరు మంచి వైద్యుల గురించి ప్రస్తావించారు. వాటి అర్థం మిగతావారంతా మంచివారు కాదని కూడా కాదు. అందుకే ఆసుపత్రులు, వైద్యుల పేర్లను ప్రస్తావించకుండా... బాధితుల ఆవేదనను మాత్రం అందజేస్తున్నాం.
 
 మా పాప పరిస్థితికి కారణం ఎవరు?
 నా భార్యకు గతనెల 15న విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పాప పుట్టింది. తల్లీబిడ్డా క్షేమం. కాకపోతే మూ డో రోజున పాపకు జ్వరం. మర్నాటికి అది యూరిన్ ఇన్ఫెక్షన్‌కు దారితీసింది. అక్కడి వైద్యుల సూచన మేరకు... బాగా పేరున్న ఓ పిల్లల వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాం. ఆయన కార్పొరేట్ ఆసుపత్రికి రిఫర్ చే శాడు. స్థానికంగా ఉండే బడా కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చాం. పాపకున్నది యూరినేషన్ సమస్య. రెండ్రోజులకు అది సర్దుకుంది. హమ్మయ్య! డిశ్చార్జి చేసేస్తారనుకున్నాం. కానీ కాసుల దాహంతో వారు డిశ్చార్జి చేయకుండా అలా ఐసీయూలోనే ఉంచారు. పాప బ్లడ్‌కు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. తరవాత మరో ఇన్ఫెక్షన్. అవి రెండూ ఐసీయూలో ఎక్కువ కాలం ఉంచటం వల్ల సోకే ఇన్ఫెక్షన్లి తరవాత తేలింది. ఇప్పుడు మా పాప వెంటిలేటర్‌పై ఉంది. ఇప్పటికే 3 లక్షలు బిల్లయింది. ఇంకా రూ.60 వేలు ఆసుపత్రికి బాకీ కూడా ఉన్నాం. పాప పరిస్థితి చూస్తే బతుకుతుందన్న గ్యారంటీ ఎంతమాత్రం లేదు. కానీ ఆశ చావకుండా చికిత్స కొనసాగిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి!! తప్పెవరిది? నా పాపకు ఏమైనా అయితే బాధ్యత వాళ్లది కాదా?
     - ప్రవీణ్, విజయవాడ
 
 తప్పుడు సమాచారం ఇచ్చారు..
మా బంధువు ఒకరు తరచూ తలనొప్పి, ఛాతీ నొప్పి వస్తే గైనకాలజిస్ట్‌ను సంప్రదించారు. ఆ డాక్టర్ గుంటూరులోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో న్యూరో ఫిజిషియన్‌ను కలవాలని సూచించారు. అక్కడికి వెళ్తే.. సీటీ స్కాన్‌తోపాటు రకరకాల పరీక్షలు చేసి, కార్డియాలజిస్ట్ వద్దకు వెళ్లాలని చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్తే రక్తపరీక్షలు, 2డీ ఎకో పరీక్షలు చేసి, ‘మీ గుండె ఎన్‌లార్జ్ అయింది. దీర్ఘకాలంపాటు మందులు వాడాలి’ అని చెప్పారు. ఆమె చాలా ఆందోళనకు గురైంది. నేను ఆమెను హైదరాబాద్ పిలిపించుకొని నా డాక్టర్ మిత్రుడికి చూపించాను. ఆయన 2డీ ఎకో పరీక్ష మా ముందే చేసి ఏమీ లేదని, అంతా సరిగ్గానే ఉందని చెప్పారు. దీంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. ఛాతీ నొప్పి అని వెళ్తే.. కేవలం డబ్బులు కోసం ఆమెతో రకరకాల పరీక్షలు చేయించి, తప్పుడు సమాచారం ఇచ్చారు.    
 - వెంకట్, గుంటూరు  
 
 ఒక్క ఇంజెక్షన్‌కు రూ.2.65 లక్షలు చెప్పారు
 మాది ఖమ్మం. మా నాన్నకు లివర్‌లో గడ్డ ఉన్నట్టు తేలితే 2010లో హైదరాబాద్ పంజగుట్టలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తీసుకువెళ్లాం. వాళ్లు అక్కడ అన్ని పరీక్షలు చేసి నెల రోజులకు కేన్సర్ అని తేల్చారు. అంకాలజీ విభాగానికి రిఫర్ చేశారు. అక్కడ అది ఏ టైప్ కేన్సరో తేల్చడానికి 10 నెలల సమయం తీసుకున్నారు. చివరికి ఆ కేన్సర్‌కు ట్రీట్‌మెంట్ లేదని చెప్పారు. నాన్న బతకాలంటే రూ.2.65 లక్షల విలువజేసే ఇంజెక్షన్ ప్రతినెలా ఇవ్వాలని చెప్పారు. తర్వాత మరికొన్ని ఆసుపత్రులకు తిరిగాం. చివరికి ఆ ఇంజెక్షన్‌ను ఓ డాక్టర్ రికమెండేషన్‌తో రూ.1.95 లక్షలకు కొన్నా. పంజగుట్టలోని అదే  ఆసుపత్రికి తీసుకువెళ్లి ఇస్తే కీమోథెరపీ ట్రీట్‌మెంట్ మొదలుపెట్టారు. కానీ నాన్న చనిపోయాడు. ఈ ఆసుపత్రిలో కేవలం టెస్టుల పేరుతోనే దాదాపు 10 నెలల కాలాన్ని వృథా చేశారు. ఇంత దారుణమా? ట్రీట్‌మెంట్ తొందరగా మొదలుపెట్టి ఉంటే మా నాన్న బతికేవారేమో!    
     - మహమ్మద్ జానిమియా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, జోహన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా
 
 ఎమ్మారైలో ఇంత మోసమా?
 నాకు భుజం నొప్పి రావడంతో హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాను. డాక్టర్ పరీక్షించి ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.50 వేలు ఖర్చవుతుందని చెప్పారు. అలాగే ఎమ్మారై చేయాలని, ఓ డయగ్నస్టిక్ సెంటర్ అడ్రస్ ఇచ్చారు. మా స్నేహితుడి వద్ద చేయించుకుంటా అని చెప్పినా వినలేదు. తీరా ఆ డాక్టర్ చెప్పిన చోటుకే వెళ్లా. రూ.12 వేలు అవుతాయన్నారు. కాస్త తగ్గించాలని నేను అక్కడి వ్యక్తిని కోరా. మాటల్లో మాటగా ఆయన మా ఊరి వాడేనని తెలిసింది. ఎమ్మారైకి ఇచ్చే రూ.12 వేలల్లో 40 శాతం దాకా ఇక్కడికి పంపిన డాక్టర్‌కే వెళ్తాయని, అందుకే అంత ఎక్కువగా తీసుకుంటారని ఆయన చెప్పారు. డాక్టర్లు ఇలా చేయడం అన్యాయం కాదా?   
  - నాయుడు, హైదరాబాద్
 
 ఆ డాక్టర్ మాట విని ఉంటే..
 కొందరు కేవలం డబ్బు కోసమే డాక్టర్ కోర్సు చదువుతున్నారు. సేవా దృక్పథం పూర్తిగా కనుమరుగైంది. నేను ఫుట్‌బాల్ ఆడుతుండగా కాలికి గాయమైంది. ఓ ఆర్థోపెడిక్ డాక్టర్ వద్దకు వెళ్లగా.. మోకాలు కీలుకు స్క్రూ వేయాలని చెప్పారు. తర్వాత మా అమ్మ మరో డాక్టర్ వద్దకు తీసుకెళ్లింది. ఆయన 15 రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. నాకు మూడ్రోజుల్లోనే తగ్గిపోయింది. ఆ డాక్టర్ మాట విని ఉంటే అనవసరంగా ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చేది!
 - ఓ బాధితుడు (పేరు వెల్లడించలేదు)
 
 అనవసరంగా కోసేస్తున్నారు..
 చాలామంది గర్భిణులకు అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారు. దాదాపు 95 శాతం మందికి సహజంగానే ప్రసవం జరుగుతుంది. కానీ నొప్పులతో ఒక మహిళను ఆసుపత్రికి తీసుకురాగానే ఆమెకు ఆ నొప్పులు తెలియకుండా ఉండేందుకు సెలైన్లు ఎక్కిస్తారు. అందులో నొప్పి తెలియని మందు కలుపుతారు. కాసేపటికి ‘నొప్పులు రావడం లేదు.. ఆపరేషన్ చేయాల్సిందే’ అని చెప్పి అవసరం లేకున్నా సిజేరియన్లు చేస్తున్నారు.  బిడ్డ పుట్టాక ఆరోగ్యం బాగోలేదంటూ అలా కూడా వేల రూపాయలు దండుకుంటున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల వ్యాపార ధోరణి పేదలు, మధ్యతరగతి వారికి శాపంలా మారింది.
 - సయీద్ మాజ్, ఖతార్(నిజామాబాద్ వాసి)
 
 కాళ్లపై పడ్డా వినలేదు..
 మా బాబాయ్‌కి, స్నేహితుడికి మెదక్‌లో యాక్సిడెంట్ అయితే వెంటనే వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తీసుకెళ్లాం. నాలుగు గంటల్లోనే రకరకాల టెస్టులు చేసి రూ.40 వేలు తీసుకున్నారు. రాత్రి 11 గంటలకు వచ్చి రూ.5 లక్షలు కడితేనే ట్రీట్‌మెంట్ మొదలుపెడతామని, ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పారు. ఇప్పుడు రూ.2 లక్షలు క ట్టి, మిగతావి పొద్దున్నే ఇస్తామని చెప్పి, కాళ్ల మీద పడినా కరుణించలేదు. దేవుడి మీద భారం వేసి వారిని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ ట్రీట్‌మెంట్‌తో ఇద్దరు బతికారు.
     - దత్తు, మెదక్
 
 ఇదీ.. డాక్టర్ల మాట
‘సాక్షి’ వరుస కథనాలపై బాధితులతో పాటు కొందరు వైద్యులూ స్పందించారు. వైద్య వృత్తిలో తామెదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ... నాణేనికి రెండోవైపు కూడా చూడాలని సూచించారు. నిజానికి ‘సాక్షి’ కథనాల్లో ఎక్కడా వైద్యుల పనితీరును తప్పుబట్టలేదు. అనైతిక వ్యాపారం తప్ప మరొకటి తెలియని కొన్ని శక్తుల ప్రవేశంతో వైద్య వ్యవస్థ భ్రష్టుపట్టిన తీరును మాత్రమే ప్రశ్నించింది. జనం లేఖల్లోనూ తాము దోపిడీకి గురవుతున్నామనే వేదన కనిపించింది తప్ప... వైద్యులపై వ్యక్తిగతంగా ఆగ్రహించిన వారెవ్వరూ లేరు. కొందరు వైద్యులు తమ మెయిల్స్‌లో ఏమన్నారో కూడా సంక్షిప్తంగా ఇస్తున్నాం...

 వారేమన్నారంటే..
 అవినీతి, నైతికత లోపించటం అనేది అన్ని రంగాల్లోనూ ఉంది. మతంతో పాటు చట్టం, న్యాయం, ప్రభుత్వం, రాజకీయాలు, మీడియా, మిలిటరీ... ఇలా ఏ ఒక్కటీ మినహాయింపు కాదు. అలాంటిదే వైద్య వ్యవస్థ కూడా. కాకుంటే ఏ వ్యవస్థలోనైనా ఉండే కొద్దిమంది ఇలాంటివారి గురించి మొత్తం వ్యవస్థనే తప్పుబట్టడం సరికాదు. కష్టపడి చదివి, మెరిట్‌లో సీట్ సంపాదించి, సేవ చేయాలనే తలంపుతోనే ఎవరైనా ఈ వృత్తిలోకి వస్తారు. ఏ సమయంలోనైనా చికిత్స చేయడానికి రెడీగా ఉంటారు. మిగతా ఉద్యోగాల్లాగే ఈ వృత్తిలోనూ డబ్బు సంపాదించాలని భావిస్తారు. అదేమీ తప్పు కాదుగా? ఇక ట్రీట్‌మెంట్ కొస్తే ఎవరైనా మంచి చికిత్స చేయాలనే అనుకుంటారు. కావాలని నిర్లక్ష్యం చేయరు. కానీ వందల మందికి చక్కని చికిత్స చేసినా పొరపాటున ఒక రోగికేదైనా జరిగితే కోట్ల కొద్దీ జరిమానా వేస్తున్నారు.
 
 ఇది సమంజసమా? కొన్ని సందర్భాల్లో రోగుల బంధువులు వైద్యులపై దాడులు కూడా చేస్తున్నారు. వారికి రక్షణ ఎక్కడుంది? ఈ వ్యవస్థలో కొన్ని లోపాలున్న మాట నిజం. కానీ అవి ఏ ఒక్కరివల్లో, కొందరివల్లో రాలేదు. ఒకవేళ ఏ ఒక్కరైనా మార్చడానికి ప్రయత్నించినా సాధ్యం కాదు. అలాంటివారిని సదరు ఆసుపత్రుల యాజమాన్యాలే బాయ్‌కాట్ చేస్తున్నాయి. దీనికి బదులు ప్రతి డాక్టరూ సొంత ఆసుపత్రి పెట్టుకోవాలనుకున్నా సాధ్యం కాదు. ఇక నియంత్రణ సంస్థల సంగతికొస్తే అవి తమకు అనుకూలమైన రీతిలోనే నడుస్తాయి. కావాల్సిన వారిని వదిలిపెట్టి.. ఎవరిని టార్గెట్ చేయాలో ఎంచుకుని మరీ చేస్తాయి. ఇన్ని లోపాలున్నప్పుడు డాక్టర్లను టార్గెట్ చేయటం కరెక్టు కాదు.
 
 కదులుదాం.. కదిలిద్దాం
 సర్కారీ, కార్పొరేట్ వైద్యంలో మీకెదురైన చేదు అనుభవాలను.. మీరు చూసిన మంచి డాక్టర్ల గురించి ‘సాక్షి’తో పంచుకోండి. వైద్య దుస్థితిని మార్చడానికి సూచనలు కూడా తెలియజేయండి. వీటిని ప్రచురించటం ద్వారా నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశమిద్దాం. మీ అనుభవాలు, ఆలోచనలను ఈమెయిల్స్, లేఖల ద్వారా ‘సాక్షి’కి పంపేటపుడు... మీ పేరు, మీకు చికిత్స చేసిన ఆసుపత్రి లేదా డాక్టరు పూర్తి పేరును, మొబైల్ నంబర్లను తప్పనిసరిగా తెలియజేయండి. మీ పేరు రహస్యంగా ఉంచాలని భావిస్తే అది కూడా రాయండి.
 
 లేఖలు, మెయిల్
 పంపాల్సిన చిరునామా: ఎడిటర్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34
 sakshihealth15@gmail.com

మరిన్ని వార్తలు