కార్పొరేషన్ బ్యాంక్ రుణరేట్ల తగ్గింపు

12 Oct, 2013 01:57 IST|Sakshi

 న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని కార్పొరేషన్ బ్యాంక్ గృహ, ఆటో. వినియోగ వస్తువులపై రుణ రేట్లను 1.75 శాతం వరకూ తగ్గించింది. పండుగ సీజన్‌లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గృహ రుణాలపై వడ్డీ రేటును అరశాతం, ఆటో రుణాలపై రేటును ఒకశాతం తగ్గిస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది. ఇక వినియోగ వస్తువుల రుణాలకు సంబంధించి వడ్డీరేటును రూ. 5 లక్షల వరకూ 1.75 శాతం తగ్గించింది.
 
 గృహ రుణాలపై ఇలా : గృహ రుణాలకు సంబంధించి రూ.50 లక్షల వరకూ అన్ని రుణాలపై రేటు 10.25 బేస్‌రేట్‌కు సమానంగా ఉంటుంది. రూ.50 లక్షలు దాటిన రుణాలపై రేటు 10.50 శాతం. రూ. 25 లక్షల వరకూ రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీలను పూర్తిగా మినహాయించారు. ఆపై మొత్తాలపై ఈ ఛార్జీలలో 50 శాతం వరకూ రాయితీ ఇస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది.
 
 వాహన, గృహోపకరణాలు రుణాలు: వాహన రుణాల విషయంలో రూ. 50 లక్షల వరకూ రుణాలపై రేటు 10.65 శాతం. ఇందుకు వర్తించే ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం రాయితీ. అలాగే కిచెన్, గృహోపకరణాలు, సోలార్ ప్యానల్స్, వాటర్ హీటర్లపై రుణ రేట్లను 12.25 శాతం నుంచి 10.50 శాతానికి బ్యాంక్ తగ్గించింది. 2014 జనవరి వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కాగా ఆకర్షణీయమైన ప్రీమియంకు వాహన బీమా కవరేజ్ ఆఫర్ చేయడానికి న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌తో బ్యాంక్ ప్రత్యేక ఏర్పాటు కూడా చేసుకుంది. పండుగసీజన్‌లో డిమాండ్ పెరుగుదల లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయం మేరకు పలు బ్యాంకులు ఇప్పటికే వివిధ విభాగాలపై వడ్డీరేట్లు తగ్గించాయి.

మరిన్ని వార్తలు