-

కాంట్రాక్ట్ వ్యవసాయానికి ధరలే అడ్డంక

7 Nov, 2013 03:26 IST|Sakshi
కాంట్రాక్ట్ వ్యవసాయానికి ధరలే అడ్డంక

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాంట్రాక్టింగ్ వ్యవసాయంలో అవకాశాలు చాలా ఉన్నప్పటికీ ఉత్పత్తి ధరను నిర్ణయించడం అనేది ప్రధాన అడ్డంకిగా ఉందని ఫిక్కి సీఈవో కాన్‌క్లేవ్ పేర్కొంది. కాంట్రాక్ట్ వ్యవసాయంలో  పంటకు ధరను మార్కెట్ రేటును బట్టి నిర్ణయిస్తారా లేక జరిగిన వ్యయానికి లాభం కలిపి ఇస్తాయా అన్న విషయంలో స్పష్టత ఏర్పడితేనే ఈ విధానం విజయవంతం అవుతుందని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. వ్యవసాయంలో ‘నెక్స్ వేవ్ ఆఫ్ ఆపర్చునిటీస్’ అనే అంశంపై ఫిక్కి ఏర్పాటు చేసిన సీఈవో సదస్సులో పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కావేరీ సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మితున్ చాంద్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశీయ వ్యవసాయ రంగం నీరు, విద్యుత్ అనే రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోందని, వీటిని పరిష్కరించగలిగితే పప్పు దినుసులను దిగుమతి చేసుకునే అవసరం ఉండదన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన వారికి ‘ఫుడ్ 360’ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి అందచేశారు.
 
 జోరుగా పీఈ, వీసీ నిధుల ప్రవాహం...
 కాగా భారత వ్యవసాయ-వ్యాపార కంపెనీల్లో  ప్రైవేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) నిధుల ప్రవాహం జోరుగా సాగనున్నది. ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి పీఈ, వీసీ ఫండ్స్ ఆసక్తిగా ఉన్నాయని కేపీఎంజీ-ఫిక్కి తాజా నివేదిక వెల్లడించింది. సదస్సు సందర్భంగా ఈ నివేదిక వెలువడింది.
 

మరిన్ని వార్తలు