పిల్లి ఆపరేషన్‌కు రూ. 19 లక్షలు!

20 Aug, 2015 08:32 IST|Sakshi
పిల్లి ఆపరేషన్‌కు రూ. 19 లక్షలు!

న్యూయార్క్: పెంపుడు జంతువులంటే ప్రాణమని చాలామంది చెబుతుంటారు. అమెరికాలోని బఫెలో సిటీకి  చెందిన ఆండ్రీ గాన్సియర్ దంపతులు మాత్రం తమ పెంపుడు పిల్లిని నిజంగానే కన్న కొడుకులా చూసుకుంటున్నారు. మూత్రపిండాల వైఫల్యంతో చావుకు చేరువైన తమ పిల్లికి వారు కిడ్నీ మార్పిడి  చేయించారు! ఇల్లు కొనేందుకు దాచుకున్న డబ్బును ఖర్చు చేసి మరీ దానికి పునర్జన్మ ప్రసాదించారు! రూ. 19 లక్షలు ఖర్చుచేసి మరీ తమ ‘బిడ్డ’ను కాపాడుకున్నారు!

కొన్నేళ్ల క్రితం రుమేనియాలోని ఓ నీటికయ్యలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఒకీని వారు కాపాడి, అప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఒకీ ఇంతకుముందు 9 గండాలు దాటింది. తాజాగా మూత్రపిండాలు విఫలమయ్యాయి. గాన్సియర్ దంపతులు ఎలాగైనా ఒకీని కాపాడుకోవాలని పెన్సిల్వేనియా వర్సిటీ వెటర్నరీ ఆస్పత్రిని సంప్రదించగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. మరో పిల్లిని దత్తత తీసుకుని, దాని నుంచి ఓ కిడ్నీని తీసి ఒకీకి అమర్చారు.

రెండు పిల్లులూ కోలుకుంటున్నాయట. ఆపరేషన్‌కే రూ. 10 లక్షలు, ఇతర ఖర్చలు కలిపి రూ. 19 లక్షలైంది. 12 ఏళ్ల ఒకీ కిడ్నీ మార్పిడి చేసినా రెండు మూడేళ్లకు మించి బతకదట. ఈ మాత్రం దానికి అంత ఖర్చెందుకని ఎవరైనా అడిగారనుకోండి.. ‘మీ సొంత బిడ్డో లేక తండ్రో మంచాన పడితే మీరు ఇదే మాటంటారా?’ అని గాన్సియర్ దంపతులు ప్రశ్నిస్తున్నారట!

మరిన్ని వార్తలు