ఆధారాల్లేవు.. హత్యకేసులో మాజీ ఎంపీకి విముక్తి!

17 Apr, 2017 19:59 IST|Sakshi
ఆధారాల్లేవు.. హత్యకేసులో మాజీ ఎంపీకి విముక్తి!

యూత్‌ కాంగ్రెస్‌ నేత హత్య కేసులో వివాదాస్పద మాజీ ఎంపీ, ఆర్జేడీ నేత మహహ్మద్‌ షాబుద్దీన్‌కు విముక్తి లభించింది. తగినన్ని ఆధారాలు లేవంటూ ఆయనను జెంషెడ్‌పూర్‌ కోర్టు నిర్దోషిగా విడిచిపెట్టింది. జెంషెడ్‌పూర్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రదీప్‌ మిశ్రాతోపాటు మరో ఇద్దరిని హత్య చేసినట్టు షాబుద్దీన్‌ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ అభియోగాలను రుజువు చేసేందుకు తగినంతగా ఆధారాలను ప్రాసిక్యూషన్‌ సమర్పించలేకపోయిందని పేర్కొంటూ.. జెంషెడ్‌పూర్‌ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జి అజిత్‌కుమార్‌ సింగ్‌ ఆయనను నిర్దోషిగా ప్రకటించారు.

బిహార్‌లో పలు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న షాబుద్దీన్‌ ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉంటున్నారు. ఆయన వీడియో కాన్ఫరేన్స్‌ ద్వారా సోమవారం కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నలుగురు నిందితులపై 2006లో కోర్టు అభియోగాలను కొట్టివేసింది. మరో ముగ్గురు విచారణలోనే చనిపోయారు. 1989 ఫిబ్రవరి 2న దుండగులు కాంగ్రెస్‌ నేత ప్రదీప్‌ మిశ్రా కారును ఆపి.. ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయనతోపాటు ఆయన స్నేహితులు జనార్దన్‌ చౌబే, ఆనంద్‌రావు ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని వార్తలు