పవన్.. చేగువేరా మాటలు చెప్పలేదు

11 Sep, 2016 22:30 IST|Sakshi
పవన్.. చేగువేరా మాటలు చెప్పలేదు

సాక్షి, విశాఖపట్నం: ప్యాకేజీ సోమ్మును పంచుకునేందుకే టీడీపీ, బీజేపీలు హోదా డిమాండ్ ను తుంగలోతొక్కాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఇప్పుడు ప్యాకేజీ సరిపోతుందంటున్న నేతలు.. విభజన సమయంలో ఐదేళ్లుకాదూ పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని ఎందుకు అడిగినట్లో? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతూ టీడీపీ హోదా సాధించలేదని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యేక హోదా విషయంలో పవన్ కల్యాణ్ కేవలం మాటలతో సరిపెట్టకుండా ఏదోఒకటి చేతల్లో చేసి చూపించాలని రాఘవులు సూచించారు. ‘చేగువేరా గురించి ఆయన తరచూ ప్రస్తావిస్తాడు. ప్రశంసిస్తాడు. పవన్.. చేగువేరా మాటలు చెప్పలేదు. తుపాకీతో సాయుధ పోరాటం చేశాడు. నువ్వు(పవన్) కూడా తుపాకి పట్టుకోమని మేం చెప్పం. అయితే రాజ్యాంగ పరిధిలో ప్రజల పక్షాన ఆందోళనలు చేయాలి’ అని రాఘవులు అన్నారు. హోదా రాకపోతే ఏపీలో టీడీపీ, బీజేపీలకు నూకలుండవని జోస్యం చెప్పారు.

అమరావతి చుట్టూనే అభివృద్ధి
రాష్ట్ర విభజన జరిగాక సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని పట్టించుకోకుండా అమరావతి చుట్టూనే అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారని రాఘవులు విమర్శించారు. గతంలో రాష్ట్ర విభజనకు అదే దారితీసిన విషయాన్ని విస్మరిస్తూ మళ్లీ అదే తప్పునే చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే మళ్లీ అలాంటి ఉద్యమమే పునరావృతమవుతుందని హెచ్చరించారు. ఏయూ ప్లాటినం జూబ్లీ హాలులో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. రాయలసీమ వెనకబాటుకు భౌతిక కారణం ఉందని, కానీ ప్రకృతి వనరులున్నా ఉత్తరాంధ్ర వెన కబడి ఉండటానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు