కోహ్లి ఎఫెక్ట్‌: కెప్టెన్‌గా ధోనీకి ఉద్వాసన?

14 Dec, 2016 11:13 IST|Sakshi
కోహ్లి ఎఫెక్ట్‌: కెప్టెన్‌గా ధోనీకి ఉద్వాసన?

ముంబై: ఎంఎస్‌కే ప్రసాద్‌ నేతృత్వంలో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ బాధ్యతలు చేపట్టి.. దాదాపు మూడు నెలలు అవుతోంది. ప్రస్తుతానికి సజావుగా సాగుతున్న సెలక్షన్‌ కమిటీకి ఎదురయ్యే అతిపెద్ద సవాల్‌ ఏమిటంటే.. మహేంద్రసింగ్‌ ధోనీని కెప్టెన్‌గా తప్పించడమే.. ప్రస్తుతం ధోనీ వన్డేలు, టీ-20లకు సారథిగా ఉన్నాడు. మరికొద్ది నెలల్లో ఈ పరిస్థితి మారిపోవచ్చు. ఇటు సారథిగానూ, అటు బ్యాట్స్‌మన్‌గానూ ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా విరాట్‌ రాణిస్తుండటమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో ధోనీని తప్పించి.. అన్ని ఫార్మెట్లలో కెప్టెన్సీ బాధ్యతలు విరాట్‌ కోహ్లికి అప్పగించక తప్పదని క్రికెట్‌ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

గత రెండేళ్లుగా టెస్టుల్లో కెప్టెన్‌గా కోహ్లి అసాధారణమైన ప్రతిభను చాటుతున్నాడు. నిజానికి కెప్టెన్‌ అయిన తర్వాతే కోహ్లి మరింత రాటుదేలాడా? అన్న సందేహం కలుగకపోదు అతని ఇటీవలి ఇన్నింగ్స్‌ను చూస్తే.. టెస్టుల్లోనే కాదు వన్డేల్లోనూ సమయం వచ్చిన ప్రతిసారి తనకు తానే సాటి అని కోహ్లి నిరూపించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మరో రెండున్నరేళ్లలో ఇంగ్లండ్‌లో జరగనున్న వన్డే క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు ఎవరు నాయకత్వం వహించాలన్నది కీలక ప్రశ్నగా మారింది.

‘ధోనీ కెప్టెన్‌గా కొనసాగించాలా? లేదా మార్పులు చేయాలా? అన్నది త్వరలోనే తేలిపోయే అవకాశముంది. వచ్చే ఏడాది వేసవిలో ఇంగ్లండ్‌ళో చాంపియన్స్‌ ట్రోపీ నాటికి ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశముంది. అప్పుడే సెలక్టర్లు 2019 వరల్డ్‌ కప్‌ వరకు ఎవరు జట్టు సారథిగా ఉండాలో నిర్ణయించే అవకాశముంది’ అని భారత మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా సేవలు అందిస్తూ భారత్‌ క్రికెట్‌ జట్టును గమనిస్తున్న చోప్రా.. ధోనీ అంతర్జాతీయ కెరీర్‌ కొనసాగింపుపైనా నిశితమైన విశ్లేషణ చేశారు.

‘ఎంతటి ప్రతిభాశాలి క్రికెటర్‌ అయినా.. కొంతకాలం అంతర్జాతీయ క్రికెట్‌ ఆడి.. ఆ తర్వాత తెరమరుగై.. మళ్లీ ఆడటం అంటే చాలా కష్టమైన విషయం. ప్రస్తుతం టెస్టులు అధికంగా ఆడుతున్నారు. దీంతో టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకొన్న ధోనీ సుదీర్ఘకాలం జట్టులో కొనసాగడం కష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతటి సామర్థ్యమున్న క్రికెటర్‌కు అయినా సత్తా చాటడం అంత సులువు కాదు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులకు అత్యున్నత ప్రమాణం ఉంది. క్రికెట్‌ పరంగా చూసుకుంటే వన్డేల కన్నా టెస్టులదే పైచేయి. ఈ నేపథ్యంలో ధోనీది చాలా క్లిష్టపరిస్థితే’ అని చోప్రా అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు