రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు

11 Sep, 2013 01:03 IST|Sakshi

20 శాతం పెరిగిన అత్యాచారాలు
 ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 823
పశ్చిమ గోదావరి, ఖమ్మం, సైబరాబాద్‌లో అత్యధికం
మహిళలపై నేరాల్లో 24 శాతం పెరుగుదల
భయాందోళన కలిగిస్తున్న దోపిడీ, దొంగతనాలు.. పెరిగిన ఆస్తి హత్యలు

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. వారిపై అత్యాచారాలు, హత్యలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కిడ్నాపులూ పెరిగాయి. కానివారు, అయినవారు అతివలపై ఘోరాలకు తెగబడుతున్నారు. గత ఏడాది తొలి ఆరు నెలలతో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆరునెలల్లో అత్యాచారాలు గణనీయంగా 19.62 శాతం పెరిగాయి. మహిళలపై మొత్తం నేరాలు 24.64  శాతం పెరిగాయి. వారిని కిడ్నాప్ చేసిన కేసులు 14.98  శాతం ఎక్కువయ్యాయి. పిల్లలు, ఇతరుల కిడ్నాపులు, దోపిడీలు, దొంగతనాలు, చీటింగ్ నేరాలు కూడా జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి.
 
 ఈ వివరాలతో రాష్ట్ర పోలీసు శాఖ.. జాతీయ నేర నమోదు విభాగానికి(ఎన్‌సీఆర్‌బీ) ఇటీవల నివేదిక పంపింది. అందులోని వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ దాకా ఐపీసీ సెక్షన్ల కింద మొత్తం 1,06,724 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది కంటే ఇవి 14.29  శాతం ఎక్కువ. ఐపీసీయేతర కేసులు 58,907 కాగా, 83,731 దర్యాప్తులో ఉన్నాయి. పెండింగ్ కేసులు హైదరాబాద్ సిటీ, సైబరాబాద్, నెల్లూరు జిల్లాలో అత్యధికం. కోర్టుల్లో 3,16,149 కే సులు విచారణలో ఉన్నాయి. 27,551 నాన్‌బెయిలబుల్ వారంట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
 
 ఆగని మృగాళ్ల ఘాతుకాలు..
 గత ఏడాది తొలి ఆరు నెలల్లో 688 అత్యాచారాల కేసులు నమోదుకాగా... ఈ ఏడాది జూన్ వరకూ 823 నమోదయ్యాయి. కిడ్నాప్ కేసులు 990 నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 68 అత్యాచార కేసులు, సైబరాబాద్‌లో 103, కరీంనగర్‌లో 61, హైదరాబాద్ సిటీ, ఖమ్మంలో 58 నమోదయ్యాయి. మహిళలపై నేరాలు 24.64 శాతం పెరిగి, ఈ కేసుల సంఖ్య 15,868గా నమోదైంది.
 
 14 శాతం పెరిగిన దోపిడీ కేసులు.
 గత ఏడాదితో పోలిస్తే దోపిడీ కేసులు 14.04 శాతం, ఇంటి దొంగతనాల కేసులు 19.80 శాతం పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆరు నెలల్లో హత్యలు 7.93 శాతం తగ్గాయి. అయితే ఆస్తికోసం జరిగే హత్యలు మాత్రం 23.66 శాతం పెరిగాయి. ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు స్వల్పంగా పెరిగి 1,745కు చేరాయి. రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగాయి. మొత్తం 22,891 రోడ్డు ప్రమాదాల్లో 7,912 చనిపోగా, 28,323 మంది గాయపడ్డారు.

మరిన్ని వార్తలు