‘కస్తూర్బా’ బాధ్యులపై క్రిమినల్ కేసు

9 Jan, 2014 03:06 IST|Sakshi

 పిట్లం/నిజామాబాద్, న్యూస్‌లైన్: నిజామాబాద్ జిల్లా పిట్లం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ప్రసవించిన సంఘటనపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు  బాధ్యుడిగా పేర్కొంటూ పాఠశాల మాజీ ప్రత్యేకాధికారి విఠల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, పాఠశాల ఏఎన్‌ఎం బాబాయ్‌ను విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అతడిపైనా కేసు నమోదు చేశారు. పాఠశాలలోని పదో తరగతి విద్యార్థిని మంగళవారం తెల్లవారుజామున 2.30గంటల ప్రాంతంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది.

 పుట్టిన బిడ్డను ఏం చేయాలో తెలీక కిటీకీలోంచి ముళ్లపొదల్లోకి విసిరేయడంతో మృతిచెందింది. ఇదిలాఉంటే విఠల్ పదవీ కాలం గత డిసెంబర్ 12న పూర్తయినప్పటికీ పాఠశాలలోనే ఉంటున్నాడన్న ఆరోపణలు వచ్చాయి. విద్యార్థిని మైనర్ అయినందున ఆమెకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతోపాటు ఇంటర్ వరకు ప్రభుత్వ సంరక్షణలో ఉంచుతామని పేర్కొన్నారు. విద్యార్థిని ప్రస్తుతం బాన్సువాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, బాన్సువాడ రూరల్ సీఐ నాగేశ్వర్‌రావు పాఠశాలకు చేరుకుని సిబ్బందిని విచారించారు. కుటుంబసభ్యులు విద్యార్థిని మేనబావ గోపాల్‌ను ఇల్లరికం తీసుకురావడంవల్లే ఇలా జరిగిందని తెలిపారు. గోపాల్‌పై 417, 420, 376, 315 సెక్షన్ల కింద  కేసులు నమోదు చేశామన్నారు.
 

మరిన్ని వార్తలు