రాహుల్ సభ కోసం పంట ధ్వంసం

7 Oct, 2015 19:00 IST|Sakshi
రాహుల్ సభ కోసం పంట ధ్వంసం

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ సభ కోసం కర్ణాటకలో చేతికొచ్చిన పంటపొలాన్ని ధ్వంసం చేయడం వివాదాస్పదంగా మారింది. ఓ నిరుపేద రైతు ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజోన్న పంటను రాహుల్ సభ కోసం కోతలు కోసే సమయానికి నరికివేసి ప్రాంగణం సిద్ధం చేశారు. విచిత్రమేమిటంటే  కరువు కారణంగా పంటలు పండక ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించడానికి రాహుల్ ఈ సభను తలపెట్టారు.

 

మధ్య కర్ణాటకలోని రానిబిన్నూర్ సమీపంలో నిర్వహించనున్న శనివారం ఈ సభ కోసం దాదాపు మూడు ఫుట్బాల్ మైదానాలకు సమానమైన ప్రదేశంలో కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇందుకోసం సభాప్రాంగణానికి సమీపంలో ఉన్న ఓ బక్క రైతు తన నాలుగు ఎకరాల పొలంలో పండించిన మొక్కజోన్న పంటను నరికేశారు. 15 రోజుల్లో పంట చేతికొస్తుందనగా ఈ చర్యకు ఒడిగట్టారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయంలో తెలిసిందే. రాహుల్ సభ కోసం చేతికొచ్చిన పంటను ధ్వంసం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మొదట స్పందించిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ "రాహుల్ వచ్చిపోయే సభాప్రాంగణం కోసం ఒక బక్కరైతు తన విలువైన పంటపొలాన్ని కోల్పోయాడు' అని ట్వీట్ చేశారు. హెలికాప్టర్ ద్వారా కర్ణాటకకు చేరుకొని తొమ్మిది కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి రాహుల్ ఆత్యహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అయితే తమకు ఇబ్బందికలుగని ప్రాంతాలలోనే రాహుల్ పాదయాత్ర సాగేవిధంగా కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేసినట్టు విమర్శలు వినవస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు