8 కోట్ల పాత నోట్లు స్వాధీనం

28 Mar, 2017 06:58 IST|Sakshi
8 కోట్ల పాత నోట్లు స్వాధీనం

- 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్‌:
నగరంలో సంచలనం.. రూ.8 కోట్ల పాత నోట్లు పట్టుబడ్డాయి. వాటిని మారుస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. బషీర్‌బాగ్‌లోని మొఘల్‌ కోర్టు బిల్డింగ్‌లో జైన్‌ అసోసియేట్, మాస్‌ ఇన్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పాత నోట్లు మార్పిడి చేస్తున్న ముఠాను పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. ఫజలుద్దీన్‌ అనే వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా నోట్ల మార్పిడి చేస్తున్నట్లు సమాచారం రావడంతో సైఫాబాద్‌ పోలీసులు, సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. 12 మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ.8 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది.

మియాపూర్, కూకట్‌పల్లి, బాలానగర్‌ ప్రాంతాల పలువురు వ్యాపారస్తులకు చెందిన బ్లాక్‌ మనీగా పోలీసులు గుర్తించారు. బ్లాక్‌మనీ వైట్‌గా చేసుకొనేందుకు ఫజల్‌ అనే బ్రోకర్‌ ద్వారా 12 మంది రూ. 8 కోట్లు మార్పిడి చేసేందుకు యత్నిస్తూ సెంట్రర్‌ జోన్‌ టాస్క్‌పోర్స్‌ పోలీసులకు దొరికిపోయారు. పోలీసుల అదుపులో ఉన్న 12 మందిలో పలువురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారని టాస్క్‌పోర్స్‌ పోలీసులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో పాత కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు తీసుకువచ్చారు.. అన్న అంశాలపై నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన సూత్రధారి, కీలక బ్రోకర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఇటీవలే బంజారాహిల్స్, బేగంపేట్, పాతబస్తీలో ఇదే గ్యాంగ్‌ పాత నోట్ల మార్పిడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న డబ్బు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారుల నేతృత్వంలో తనిఖీ చేసిన తరువాత ఐటీ వారికి అప్పగించే అవకాశం ఉందని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు