సీఆర్‌పీఎఫ్ అధికారికి శౌర్యచక్ర

16 Aug, 2013 22:54 IST|Sakshi

మావోయిస్టుల ఏరివేత కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ పి.ఆర్.మిశ్రా అరుదైన ఘనత సాధించారు. దేశసేవలో సాహసవీరులకు అందించే మూడవ అత్యున్నత  పురస్కారం శౌర్యచక్రను స్వీకరించిన పారామిలటరీ బలగాలకు చెందిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. గతంలో ఆయనకు ఐదు సాహస పతకాలు లభించాయి.

కోబ్రా విభాగంలో కమాండో శిక్షణ పొందిన అధికారి అయిన మిశ్రాను సహచరులు టాప్‌గన్‌గా పిలుచుకుంటారు. ఆయన  ఐదుసార్లు నక్సల్స్ కాల్పుల్లో గాయపడ్డారు. ఆస్పత్రిలో రెండు నెలల్లోనే కోలుకుని తిరిగి విధుల్లోకి చేరారు. మావోయిస్టు కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్న జార్ఖండ్‌లో తొమిదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు.

పోలీసుల్లో నైతిక స్థైర్యం నింపేందుకు ప్రభుత్వం ఆయన్ను ప్రత్యేకంగా డిప్యూటేషన్‌పై పంపింది. ప్రస్తుతం జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో ఆదనపు ఎస్పీ(ఆపరేషన్స్)గా ఉన్నారు. ప్రమాదకరమైన సాహసాలకు ఆయన పెట్టిందిపేరు. నక్సల్స్ హిట్‌లిస్ట్‌లో ఉన్నా ఎక్కడా వెనుకంజ వేయలేదు. మావోయిస్టుల కమాండర్ జితేంద్ర అలియాస్ జీతును గతేడాది సెప్టెంబర్‌లో కాల్చి చంపినందుకు ఆయనకు శౌర్యచక్ర, పోలీస్ పతకం లభించాయి.

మరిన్ని వార్తలు