వడ్డీరేట్ల కోతను ఇక మర్చిపోండి!

12 Dec, 2016 15:25 IST|Sakshi
వడ్డీరేట్ల కోతను ఇక మర్చిపోండి!
ముంబై : బ్యాంకుల వద్ద జమవుతున్న భారీ డిపాజిట్లతో, రుణాలపై భారీ రేట్ల కోత ఉంటుందనే అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. వడ్డీ రేట్లు దిగొస్తాయని బ్యాంకులతోపాటు పలు రిపోర్టులు కూడా అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా సెంట్రల్ బ్యాంకు ఇంక్రిమెంటల్ నగదు నిల్వల నిష్ఫత్తిని 100 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించడంతో ఇక ఇప్పుడు వడ్డీ రేట్ల కోతపై ఆశలను వదులుకోవాల్సిందేనని క్రిసిల్ రిపోర్టు వెల్లడించింది. ఆర్బీఐ తాజా ఆదేశాలతో బ్యాంకుల నుంచి రూ.3 ట్రిలియన్ నగదు తరలిపోనుందని, ఇది వడ్డీరేట్లపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. సెప్టెంబర్‌ 16- నవంబర్‌ 11 మధ్య కాలానికి ఆర్‌బీఐ ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది. అంటే నవంబర్‌ 26నుంచీ బ్యాంకులు ఈ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది.
 
పెద్ద నోట్ల రద్దుతో కుప్పలుతెప్పలుగా బ్యాంకుల వద్ద జమవుతున్న డిపాజిట్ల నేపథ్యంలో లిక్విడిటీని నియంత్రించేందుకు తాత్కాలిక చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కానీ ఈ నిర్ణయంతో రుణాలపై వడ్డీరేట్ల కోత ఆశలు ఆవిరయ్యాయని క్రిసిల్ పేర్కొంది. బ్యాంకులు వడ్డీరేట్ల కోతను జాప్యం చేయనున్నట్టు తెలిపింది. అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై బ్యాంకులు అందిస్తాయని 3-4 శాతం వడ్డీరేట్ల వాగ్దానం కూడా నెరవేరబోదని తెలిపింది. సీఆర్ఆర్కు నగదు తరలిపోతున్నందున్న డిపాజిట్లపై ఎలాంటి వడ్డీలు కస్టమర్లు పొందే అవకాశముండదని వ్యక్తంచేసింది. పెద్దనోట్ల రద్దుతో వృద్ధి అంచనాలు తగ్గుతున్న నేపథ్యంలో డిసెంబర్ 7న జరుగబోయే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేట్ నిర్ణయం కీలకంగా మారనుందని క్రిసిల్ పేర్కొంది. 
 
మరిన్ని వార్తలు