హాలీవుడ్‌ సినిమాలోనూ ‘జల్లికట్టు’

21 Jan, 2017 20:02 IST|Sakshi
హాలీవుడ్‌ సినిమాలోనూ ‘జల్లికట్టు’

న్యూఢిల్లీ: తమిళుల సంప్రదాయక క్రీడ ‘జల్లికట్టు’ జంతువులను హింసించడం కిందకు వస్తుందా, లేదా అన్న అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో లస్సే హాల్‌స్టార్మ్స్‌ దర్శకత్వం వహించిన హాలివుడ్‌ చిత్రం ‘ఏ డాగ్స్‌ పర్పోస్‌’ విడుదలవుతోంది. ఇందులో ప్రధాన పాత్రయిన కుక్క ఐదు దశాబ్దాలపాటు పలు అవతారాలెత్తి పలువురు యజమానుల వద్ద పెరుగుతూ ఉంటోంది. ఈ పలు జీవితాల కాలాల్లో ‘ప్రేమ–మరణం’ అనే అంశాల చుట్టూ కుక్క మదిలో మెదిలే ఆలోచనల సమాహారమే సినిమా ఇతివత్తం.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకులకు, ముఖ్యంగా జంతు ప్రేమికులకు కన్నీళ్లు తెప్పించింది. ఈ సినిమాను ప్రోత్సహించాలని పెటా లాంటి సంస్థలు కూడా నిర్ణయించాయి. ఈ సినిమా షూటింగ్‌ కోసం జర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన కుక్కను వేగంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలోకి బలవంతంగా దించేందుకు ప్రయత్నిస్తుంటే అది తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించడానికి సంబంధించిన సన్నివేశం వీడియోను అమెరికా ఎంటర్‌టైన్‌మెంట్‌ వెబ్‌సైట్‌ ‘టీఎంజీ’ ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేసింది. జంతువులను హింసిస్తారా ? అంటూ ఇప్పుడు జంతు ప్రేమికులు ఈ సినిమాపై మండిపడుతున్నారు. ఈ సినిమాను బహిష్కరించాలంటూ పెటా ఏకంగా ప్రజలకు పిలుపునిచ్చింది. అంతేకాకుండా హాలివుడ్‌ చిత్రాలకు జంతువులను సరఫరా చేస్తున్న ‘బర్డ్స్‌ అండ్‌ యనిమల్స్‌ అన్‌లిమిటెడ్‌’ సంస్థపై పెటా కేసు కూడా పెట్టింది.

ఆ కుక్కకు ఎలాంటి ప్రాణాపాయం కలుగుకుండా తాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటూ సినిమా నిర్మాతలు ఎంత మొత్తుకుంటున్న సోషల్‌ మీడియాలో మాత్రం విమర్శలు చెలరేగుతున్నాయి. సినిమా షూటింగ్‌ల కోసం వివిధ రకాల జంతువులను వినియోగించడం, అందుకోసం వాటిని గంటల తరబడి బోనుల్లో నిర్బంధించడం, శిక్షణలు ఇవ్వడం ద్వారా హింసించడం ‘ఈ డాగ్‌ పర్పోస్‌’ సినిమాకే పరిమితం కాలేదు. పిల్లలను విపరీతంగా ఆకట్టుకున్న హారీ పాటర్‌ సిరీస్, ది బ్యాట్‌ మన్‌ రిటర్న్స్, గుడ్‌లక్‌ చుక్‌ లాంటి సినిమాల షూటింగ్‌ సందర్భంగా జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి.  

అలా అని ఈ జంతు హింస హాలివుడ్‌ సినిమాలకే పరిమితం కాలేదు. బాలీవుడ్, ప్రాంతీయ భాషా చిత్రాల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. తెలుగులో ఎస్వీ కష్ణారెడ్డి తీసిన ‘ఘటోత్కచుడు’ చిత్రంలో అక్కినేని నాగార్జున ఓ పాటలో నటించిన విషయం తెలిసిందే. ఆ పాట చిత్రీకరణ కోసం ఓ పులిని ఉపయోగించారు. అయితే ఆ పులి ఎవరిని కరవకుండా ఉండేందుకు దాని మూతికి కుట్లు వేశారంటూ వార్తలు రావడంతో అప్పట్లో  పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఆయన భార్య అమల జంతు ప్రేమికురాలవడం, బ్లూక్రాస్‌ సొసైటీ ని నిర్వహిస్తుండడం వల్ల గొడవ ఎక్కువ జరిగింది.