సీఎస్‌ఆర్... 50 వేల కొత్త కొలువులు

14 Oct, 2013 01:07 IST|Sakshi
సీఎస్‌ఆర్... 50 వేల కొత్త కొలువులు
 న్యూఢిల్లీ: కంపెనీల సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కారణంగా 50 వేల మరిన్ని ఉద్యోగావకాశాలు ఉత్పన్నమవుతాయని నిపుణులంటున్నారు. సీఎస్‌ఆర్‌ను తప్పనిసరి చేయడం వల్ల ఈ రంగంలో నిపుణులకు డిమాండ్ పెరుగుతుందని, రానున్న సంవత్సరాల్లో ఈ ఉద్యోగాల సంఖ్య 50 శాతానికి పైగా పెరుగుతుందని వారంటున్నారు. కంపెనీల చట్టం పరిధిలోకి సుమారుగా 8,000 కంపెనీలు వస్తాయని, ఫలితంగా కొత్త ఉద్యోగావకాశాలు ఉత్పన్నమవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సీఎస్‌ఆర్ కార్యకలాపాలను కంపెనీ కమ్యూనికేషన్స్ విభాగం చూస్తోం దని, కొత్త కంపెనీల చట్టం కారణంగా సీఎస్‌ఆర్ కోసం కనీసం ఐదారుగురితో ఒక జట్టు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని నిపుణులంటున్నారు. సీఎస్‌ఆర్ నిపుణుల కోసం డిమాండ్ 50-60% పెరిగే అవకాశాలున్నాయని ప్రముఖ హెచ్‌ఆర్ సంస్థ గ్లోబల్‌హంట్ ఎండీ సునీల్ గోయల్ చెప్పారు. 
 
   సీఎస్‌ఆర్‌ను ఒక కెరీర్‌గా ఇప్పటికే పలువురు ఎంచుకుంటున్నారని, వీరి సంఖ్య మరింత పెరుగుతుందని చేంజ్‌యువర్‌బాస్‌డాట్‌కామ్ సీఈవో భూపేందర్ మెహతా అంచనా వేస్తున్నారు. కంపెనీ చిన్నదైనా, పెద్దదైనా సీఎస్‌ఆర్ కార్యకలాపాలు నిర్వహించాల్సి రావడమే దీనికి ప్రధాన కారణమని వివరించారు. 
 జౌళి రంగంలో 50 లక్షల ఉద్యోగాలు: కావూరి జౌళి (టైక్స్‌టైల్స్) రంగంలో నాలుగేళ్లలో 50 లక్షల అదనపు ఉద్యోగాలు రానున్నాయని టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. 12వ పంచవర్ష ప్రణాళిక కాలం(2012-17)లో ఉత్పన్నమయ్యే ఈ కొత్త కొలువుల కారణంగా ఈ రంగంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 5 కోట్లకు చేరుతుందన్నారు.
 
 క్యూ2లో 1.36 లక్షల కొత్త ఉద్యోగాలు
 ముంబై: ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో కంపెనీలు 1.36 లక్షల కొత్త ఉద్యోగాలిచ్చాయని ఆసోచామ్ పేర్కొంది.  కొత్త కొలువుల్లో హైదరాబాద్ వాటా 16.5%. క్యూ2లో  కొత్త కొలువుల్లో 61% ఉద్యోగాలు టాప్-5 మెట్రో నగరాల్లోనే వచ్చాయి. క్యూ1లో వచ్చిన ఉద్యోగాల (1.25 లక్షల ఉద్యోగాలు)తో పోల్చితే క్యూ2లో కొత్త కొలువుల వృద్ధి  9 శాతంగా ఉంది. ఇక రంగాల వారీగా చూస్తే ఐటీ, ఐటీ అనుబంధ సర్వీసులు, ఐటీ హార్డ్‌వేర్ రంగాల్లో 42% ఉద్యోగాలొచ్చాయి. తర్వాతి స్థానాల్లో బ్యాంకింగ్, బీమా, నిర్మాణం, ఇంజినీరింగ్ రంగాలు ఉన్నాయి.
 
మరిన్ని వార్తలు