విప్లవ యోధుడు ఫెడల్‌ క్యాస్ట్రో కన్నుమూత

12 Dec, 2016 15:16 IST|Sakshi
విప్లవ యోధుడు ఫెడల్‌ క్యాస్ట్రో కన్నుమూత

హవానా: కమ్యూనిస్టు శిఖరం కూలిపోయింది. క్యూబా మాజీ అధ్యక్షుడు ఫెడల్‌ క్యాస్ట్రో(90) కన్నుమూశారు. గడిచిన కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యల కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆయన స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10:30కు(భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 9గంటలకు) కన్నుమూశారు. ఫెడెల్‌ సోదరుడు, ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు రౌల్‌ క్యాస్ట్రో ఈ విషయాన్ని జాతీయ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. ఫెడల్‌ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను కుగదీసింది.

ఫెడల్‌ అలెజాండ్రో క్యాస్ట్రో రూస్‌(ఫెడల్‌ క్యాస్ట్రో) 1926, ఆగస్టు 13న బిరాన్‌(హొల్గూయిన్‌ ఫ్రావిన్స్‌)లో జన్మించారు. హవానా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. నాటి అమెరికా అనుకూల బటిస్టా సేనలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ క్యూబా చేస్తోన్న ఆందోళనల్లో విద్యార్థి నాయకుడిగా భాగం పంచుకున్న క్యాస్ట్రో.. తర్వాతి కాలంలో నిర్బంధాలను ఎదుర్కొన్నారు. పోరాటానికి వెన్నుచూపని నైజం అతడిని పార్టీ నాయకుడిగా ఎదిగేలా చేసింది. ఫెడల్‌ క్యాస్ట్రో నేతృత్వంలో చేగువేరా, రావుల్‌క్యాస్ట్రో, ఇంకా వేలాది మంది కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ క్యూబా కార్యకర్తలు జరిపిన విప్లవ పోరాటం ఒక సమోన్నత చరిత్ర. 1959లో క్యూబాను హస్తగతం చేసుకున్న ఆ పార్టీయే నేటికీ అధికారంలో కొనసాగుతుండటం గమనార్హం.

1959 నుంచి 1976దాకా క్యూబా ప్రధానమంత్రిగా ఉన్న క్యాస్ట్రో.. అనంతరం దేశాధ్యక్షుడిగా ఎన్నికై, 2008 వరకు ఆ పదవిలో కొనసాగారు. మాక్సిస్ట్‌, లెనినిస్ట్‌ సిద్ధాంతాలకు క్యూబా జాతీయతను రంగరిస్తూ ఫిడెల్‌ అనుసరించిన విధానం దేశంలో అతనిని తిరుగులేని నేతగా నిలబెట్టింది. విద్య, వైద్య, ప్రజా సేవల రంగంలో క్యూబా ప్రపంచ దేశాలన్నింటిలోకీ పైస్థానంలో నిలిచేలా చేసింది. ప్రపంచంలోనే ఎక్కువ మంది డాక్టర్లను అందించిన దేశంగా, సుగర్‌ బౌల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌గా క్యూబా ఎదగడం వెనుక క్యాస్ట్రో కృషి అనిర్వచనీయం. వృధాప్యం కారణంగా 2008లో ఫెడెల్‌ అధ్యక్ష స్థానం నుంచి తప్పుకున్నారు. తర్వాత ఆయన తమ్ముడు రావుల్‌ క్యాస్ట్రో అధ్యక్ష పదవిని చేపట్టారు.