'గంగలోనే గణేశ్'పై భగ్గుమన్న వారణాసి

5 Oct, 2015 20:51 IST|Sakshi
వారణాసి వీధుల్లో పోలీసులు (ఇన్ సెట్: ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో తగలబడుతున్న వాహనం)

వారణాశి: ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో హిందూత్వ ప్రతినిధులు, పోలీసులకు మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. హిందూత్వ సంస్థల ప్రతినిధులపై సెప్టెంబర్ 22న జరిగిన లాఠీ చార్జిని నిరసిస్తూ ఈరోజు (సోమవారం) ఉదయం నిర్వహించిన ర్యాలీ.. చివరికి హింసాయుతంగా మారింది. ఒక దశలో పోలీసు బలగాలపై రాళ్లదాడికి పాల్పడ్డ ఆందోళనకారులు.. పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు నిప్పుపెట్టారు. కొద్ది నిమిషాల్లోనే అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు పాకాయి.

దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు.. నగరంలోని  దశాశ్వమేధ, చౌక్, కొత్వాలీ, లుక్సా ఏరియాల్లో సోమవారం రాత్రి నుంచి కర్ఫ్యూ విధించారు. గణేశ్ విగ్రహాలను గంగా నదిలో నిమజ్జనం చేసే విషయంలో ప్రభుత్వాధికారులకు, మండపాల నిర్వాహకులకు మధ్య తలెత్తిన విబేధాలే ప్రస్తుత అల్లర్లకు మూల కారణం.

క్లీన్ గంగా ప్రాజెక్టులో భాగంగా గణపతి విగ్రహాలను సైతం గంగా నదిలో నిమజ్జనం చేయరాదంటూ అధికారులు నిర్ణయించారు. అయితే మండపాల నిర్వాహకులు మాత్రం 'గంగలోనే గణేశ్ నిమజ్జనం జరగాలి' అని పట్టుపట్టారు. ప్రభుత్వాధికారుల తీరును నిరసిస్తూ సెప్టెంబర్ 22న పలువురు ఆందోళనకు దిగారు. ఆ సందర్భంగా చోటుచేసుకున్న లాఠీచార్జిలో పలువురు వీహెచ్ పీ, బజరంగ్ దళ్ నేతలు గాయపడ్డారు. అప్పటినుంచి చిన్నా చితకా సంఘటనలు జరుగుతూనే ఉన్నప్పటికీ సోమవారం నాటి ర్యాలీ వారణాసిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

మరిన్ని వార్తలు