నోట్ల కష్టాలు ఇప్పుడు కార్డులకు వచ్చేశాయ్!

15 Nov, 2016 16:57 IST|Sakshi
నోట్ల కష్టాలు ఇప్పుడు కార్డులకు వచ్చేశాయ్!
న్యూఢిల్లీ: నోట్ల కష్టాలు ఇప్పుడు డెబిట్, క్రెడిట్ కార్డులకు కూడా వచ్చాయి. దేశవ్యాప్తంగా పలు రెస్టారెంట్లలో, మాల్స్‌లో, మల్టీఫ్లెక్సుల్లో తాత్కాలికంగా డెబిట్, క్రెడిట్ కార్డుల సర్వీసులు నిలిచిపోయాయంటూ కౌంటర్ల ముందు నోటీసు బోర్డులు వెలిశాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వరకు ఈ సర్వీసులు నిలిచిపోగా, కొన్ని ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా ఈ సర్వీసులు పునరుద్ధరణ కాలేదు. 
 
ఇదివరకెప్పుడు లేని విధంగా డెబిట్, క్రెడిట్ కార్డుల సేవలు విపరీతంగా పెరిగిపోవడంతో సర్వర్ల మధ్య సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కార్డుల సర్వీసుల్లో మూడు విభాగాల సర్వర్లు ప్రత్యక్ష పాత్ర పోషిస్తాయి. ఇవన్నీ ఒకదానికి ఒకటి అనుసంధానమై పనిచేయాల్సి ఉంటుంది. ఎక్కడ సాంకేతిక సమస్య ఉత్పన్నమైనా సర్వీసులు మధ్యలో నిలిచిపోతాయి. ఇంటర్నెట్ సర్వీసు ప్రొఫైడర్, సంబంధిత బ్యాంకు, పేమెంట్ గేట్‌వే సంస్థ సర్వర్లు ఈ సర్వీసుల్లో ప్రత్యక్ష పాత్ర పోషిస్తాయని అనేక ప్రభుత్వ సంస్థలకు సలహాదారు, ఇండియన్ సైబర్ ఆర్మీ వ్యవస్థాపకులు కిస్లే చౌధరి తెలిపారు. ఈ మూడు సంస్థల్లో ఏ సర్వర్ డౌన్ అయినా లేదా డిమాండ్‌కు తగ్గ సామర్థ్యం లేకపోయినా సమస్యలు వస్తాయని ఆయన వివరించారు. 
 
డెబిట్, క్రెడిట్ కార్డుల విషయంలో బ్యాంక్ సర్వీసులపై తమకు పెద్దగా ఒత్తిడి లేదని, బ్యాంకు సర్వర్ల సామర్థ్యం చాలా ఎక్కువగానే ఉందని రాజస్థాన్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్ హెడ్ కల్పనా గుప్తా మీడియాకు తెలిపారు. ప్రస్తుత నోట్ల మార్పిడియే తమకు పెద్ద సమస్యగా మారిందని, తగినంత సిబ్బందిలేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆమె చెప్పారు. సాధారణంగా చెల్లింపు సంస్థల సర్వర్ల వద్దనే సమస్యలు వస్తాయని, ఆ సంస్థకు ఒక బ్యాంకు ఆన్‌లైన్ రూటు బిజీగా ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా మరో బ్యాంకు నుంచి చెల్లింపులు జరిపేందుకు ఆ సంస్థకు వీలుండాలని, అలా ఉండాలంటే ఆ చెల్లింపు సంస్థలు పలు బ్యాంకులతో టైఅప్‌ పెట్టుకుని ఉండాలని ఆమె సూచించారు. 
 
ఎలక్ట్రానిక్ పేమెంట్స్ బాగా ఊపందుకున్నప్పటికీ మాస్టర్ కార్డు చెల్లింపులకు మాత్రం ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని దక్షిణాసియా డివిజన్ అధ్యక్షుడు పోరుష్ సింగ్ తెలిపారు. సెకనుకు 4,300 కోట్ల లావాదేవీలు నిర్వహించే నెట్‌వర్క్ తమ మాస్టర్ కార్డుకుందని ఆయన తెలిపారు. 
మరిన్ని వార్తలు