పూతేసుకొచ్చినా.. పట్టేసుకున్నారు!

11 Feb, 2014 10:05 IST|Sakshi
పూతేసుకొచ్చినా.. పట్టేసుకున్నారు!

మెరిసేదంతా బంగారం కాదంటారు. అలాగే, మెరవనిదంతా బంగారం కాదని కూడా అనుకోనక్కర్లేదు. ఎందుకంటే, బంగారం గొలుసులకు అల్యూమినియం పూత పూసి, అది పుత్తడి కాదు.. ఉత్తదే అని చూపించడానికి ప్రయత్నించాడో ఘనుడు. కానీ, కస్టమ్స్ అధికారులు ఊరుకుంటారా, పుటుక్కున అతగాడిని పట్టేసుకున్నారు. విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. షూ సాక్సులు.. లో దుస్తుల్లో ఇప్పటి వరకు బంగారాన్ని తీసుకొచ్చేవారు. తాజాగా ఓ కేరళవాసి బంగారు గొలుసుకు అల్యూమినియం పూతపూసుకుని వచ్చి కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పే యత్నంచేసి విఫలమయ్యాడు. అతడి నుంచి అధికారులు సుమారు 400 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో కేరళ రాష్ట్రం కాసర్‌ఘడ్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రెహమాన్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈకే 524 విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్‌కు చేరుకున్నాడు. తనిఖీల్లో అతడి ట్రాలీ బ్యాగుకు డిజైన్‌గా తెల్లటి తీగలు కనిపించాయి.
 
 దీంతో అనుమానించిన అధికారులు.. అల్యూమినియంతో ఉన్న తీగలను బయటకు తీసి పైపూత తొలగించారు. దీంతో 400 గ్రాముల గొలుసులు బయటపడ్డాయి. వీటి విలువ రూ.12 లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆదివారం రాత్రి 1:30 గంటలకు హైదరాబాద్‌వాసి ఇసాహషీమ్ టైగర్ ఎయిర్‌లైన్స్ విమానం టీఆర్ 2624లో థాయ్‌ల్యాండ్ నుంచి వచ్చాడు. 221 గ్రాముల బరువు, సుమారు రూ.6.63 లక్షల విలువచేసే బంగారుగొలుసు అతడు ధరించాడు. దానికి రశీదులు లేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.    -న్యూస్‌లైన్, శంషాబాద్

>
మరిన్ని వార్తలు