'అవినీతి'విచారణకు సీవీసీ ఎదురుచూపులు!

23 Sep, 2014 20:11 IST|Sakshi

న్యూఢిల్లీ: పలువురు ఐఏఎస్ అధికారులు సహా అవినీతి ఆరోపణలున్న 59 మంది ప్రభుత్వ ఉద్యోగులపై విచారణకు అనుమతి కోరుతూ కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) చేసిన అభ్యర్థనలు కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా మంత్రిత్వ శాఖల వద్ద 26 కేసులకు సంబంధించి ఫైళ్లపై ఎటువంటి ముందడుగు పడలేదు. ఆ అధికారులపై విచారణకు అనుమతి ఇవ్వాలని సీవీసీ మరోసారి ఆయా శాఖలను విజ్ఞప్తి చేసింది. వాటిలో కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, ఫించన్ల శాఖ, ఢిల్లీ జల్ బోర్డుల వద్ద ఐదేసి కేసులు అనుమతి కోసం ఎదురుచూస్తుండగా.. బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద 4, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వద్ద 3 పెడింగ్‌లో ఉన్నాయని సీవీసీ వెబ్‌సైట్ పేర్కొంది.

 

నిబంధనల ప్రకారం నాలుగు నెలల్లోగా అనుమతుల విషయంలో ఆయా విభాగాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సీబీఐ విచారణకు అనుమతించడానికి సంబంధించిన కేసుల్లో కొన్ని మూడేళ్ల కిందటివి కూడా ఉండటం విశేషం.

మరిన్ని వార్తలు