కారు ఢీకొని.. ఎమ్మెల్యే వాహనంపై పడి సైక్లిస్టు మృతి

4 Nov, 2016 11:19 IST|Sakshi
కారు ఢీకొని.. ఎమ్మెల్యే వాహనంపై పడి సైక్లిస్టు మృతి
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో దారుణం జరిగింది. 48 ఏళ్ల వ్యక్తి సైకిల్‌పై వెళ్తుండగా ఆయనను వేగంగా వస్తున్న ఒక ఎస్‌యూవీ ఢీకొంది. దాంతో ఆయన ఎగిరి.. వెనక వస్తున్న బీజేపీ ఎమ్మెల్యే పంకజ్ దేశాయ్ కారుమీద పడి మరణించారు. బొరియావీ గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న ఎస్‌యూవీ.. ఎమ్మెల్యే వెళ్తున్న ఇన్నోవా కారును ఎడమవైపు నుంచి ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించింది. ఎమ్మెల్యే కారుకు ముందు శివభాయ్ రాథోడ్ అనే వ్యక్తి సైకిల్ మీద వెళ్తుండగా ఆయనను ఆ కారు ఢీకొంది. మనిషిని ఢీకొన్న విషయం గమనించి కూడా ఏమాత్రం ఆగకుండా అదే వేగంతో ఆ వాహనం వెళ్లిపోయిందని ఆనంద్ జిల్లా పోలీసు స్టేషన్ ఎస్ఐ యూఏ దభీ తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కారు ఆపిన ఎమ్మెల్యే దేశాయ్.. బాధితుడిని నడియాడ్ సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
 
అయితే చికిత్స పొందుతూ శివభాయ్ రాథోడ్ మరణించారని, దాంతో తాము గుర్తుతెలియని వాహనం డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. పంకజ్ దేశాయ్ నడియాడ్ ఎమ్మెల్యే. ఆయన గుజరాత్ అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆనంద్ వెళ్లిన ఆయన అక్కడినుంచి తిరిగి తన నియోజకవర్గానికి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. రాథోడ్‌కు తన కారు ముందు అద్దం తగిలి తలకు గాయాలయ్యాయని, తీవ్రంగా రక్తస్రావం అవుతుండటంతో తాను 108కు కాల్ చేసి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లానని ఆ తర్వాత పంకజ్ దేశాయ్ విలేకరులకు తెలిపారు.
మరిన్ని వార్తలు