శాంతిస్తున్న 'వర్దా', ఏడుగురు మృతి

13 Dec, 2016 07:44 IST|Sakshi
శాంతిస్తున్న 'వర్దా', ఏడుగురు మృతి
చెన్నై: కొద్ది గంటలపాటు చెన్నై మహానగరంతో పాటు ఉత్తర తమిళనాడును అతలాకుతలం చేసిన వర్దా తుపాను చెన్నై నగరాన్ని దాటేసింది. దీంతో ప్రచండ గాలుల వేగం  కూడా తగ్గుముఖం పడుతోంది. సోమవారం మధ్యాహ్నం తీరం దాటే ముందు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ప్రస్తుతం 15-25 కిలోమీటర్ల వేగానికి తగ్గాయి. తుపాను చెన్నైను దాటి వెళ్లిపోయినట్లు ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. 
 
చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురంలలో వచ్చే 24 గంటల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.  వర్దా ధాటికి నగరంలో ఏడుగురు చనిపోయినట్లు సమాచారం. వీరిలో 3 సంవత్సరాల బాలుడితో పాటు నలుగురు మహిళలు ఉన్నట్లు తెలిసింది. వర్దా తుపాను చెన్నై వాసులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలో భారీగా చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ప్రధానరహదారుల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రంగంలోకి దిగిన సహాయక బృందాలు చెట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
కొట్టివక్కం, పలవక్కం, ఫోర్ షోర్ ఎస్టేట్, రోయపురంలలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అక్కడక్కడా గోడలు కూలిపోయిన సంఘటనలు జరిగినట్లు రిపోర్టులు కూడా అందాయి. దీంతో చెన్నై మొత్తం అంధకారంలోనే మగ్గుతోంది. కరెంటు వ్యవస్ధను పునరుద్ధరించేందుకు ఒక రోజు పడుతుందని టీఎన్ఈబీ అధికారులు చెప్పారు. బీసెంట్ నగర్, కేకే నగర్, ఖదేర్ నవాజ్ ఖాన్ రోడ్, అడమ్ బక్కం, మెరినాల్లో వీచిన భారీ గాలులకు సెల్ టవర్లు కుప్పకూలాయి. 
మరిన్ని వార్తలు