ఐక్యతతోనే రాజ్యాధికారం: డి.శ్రీనివాస్

1 Nov, 2013 04:22 IST|Sakshi
ఐక్యతతోనే రాజ్యాధికారం: డి.శ్రీనివాస్

బీసీల రాష్ట్ర స్థాయి సదస్సులో పీసీసీ మాజీ చీఫ్ డీఎస్
పార్టీలకతీతంగా సంఘటితం కావాలి
యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలి: దేవేందర్‌గౌడ్
జాతీయ పార్టీలతోనే సామాజిక న్యాయం: దత్తాత్రేయ

 
 సాక్షి, హైదరాబాద్: బడుగు, బలహీన వర్గాల్లో పూర్తిస్థాయి ఐక్యత వచ్చినప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, ఇందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్క బీసీ వ్యక్తి పార్టీలకతీతంగా సంఘటితం కావాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం జూబ్లీహాల్‌లో రాష్ట్రస్థాయి బీసీల సదస్సు జరిగింది. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సదస్సులో డీఎస్ మాట్లాడుతూ.. బీసీలలో చైతన్యం బాగా పెరిగిందని, హక్కుల సాధన కోసం సీఎంలను కూడా నిలదీసే స్థాయికి ఎదిగారని అన్నారు.
 
 ఇదే స్ఫూర్తితో అందరూ ఏకమై రాజ్యాధికారం దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీలకు సబ్‌ప్లాన్ తప్పక సాధించి తీరుతామని, కృష్ణయ్య చేస్తున్న పోరాటం ఫలించే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. బీసీలు సాధించాల్సింది చాలా ఉందని, ఇందుకు ప్రతి బీసీ వ్యక్తి సైనికుడిలా పనిచేయాలని కోరారు. మరో మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ... బీసీలు ఏ వర్గానికీ తీసిపోరని, ఎవరికంటే బలహీనులు కారని చెప్పారు. త్వరలోనే బీసీల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. బీసీలకు సబ్‌ప్లాన్ కాకుండా స్పెషల్ కాంపొనెంట్ ప్లాన్ కింద లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. బీసీలకు రాయితీలివ్వాలని ప్రభుత్వాలను అడగడం సిగ్గుగా ఉందని, యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు ఎదగాలని టీడీపీ ఎంపీ దేవేందర్‌గౌడ్ అన్నారు.
 
 ఈ దేశం ఎవరి జాగీరు కాదని, ఉత్పత్తిని సృష్టించే కులాలు రాజ్యాధికారాన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. సదస్సులో ఎంపీ మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ.. మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం దక్కాలని, దశాబ్దాలుగా అధికార స్థానాలపై తిష్టవేసిన వారిని సాగనంపాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా బీసీల కోసం ఉద్యమిస్తున్న కృష్ణయ్యను పార్లమెంటుకు పంపాలన్నారు. జాతీయ పార్టీలతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. బీసీలు లేని పార్టీలు దేశంలో లేవని, 2014 ఎన్నికలను బీసీలే శాసించాలని ఆకాంక్షించారు. తమ పార్టీ తరఫున బీసీ అయిన మోడీని ప్రధాని అభ్యర్థిగా నిర్ణయించామని చెప్పారు. ఈ సదస్సులో బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం చైర్మన్, ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, పలు బీసీ సంఘాల నేతలు, కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 
 రాజకీయ శక్తిగా బీసీ ఉద్యమం: ఆర్.కృష్ణయ్య
 దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రూపుదిద్దుకున్న బీసీ ఉద్యమాన్ని త్వరలోనే రాజకీయ శక్తిగా మారుస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. బీసీల రాష్ట్రస్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యమాన్ని రాజకీయ శక్తిగా మార్చేందుకు డిసెంబర్ 15న హైదరాబాద్‌లోని నిజాం కళాశాల గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభనే వేదికగా చేసుకుంటామని చెప్పారు. దొరల రాజ్యం కూలిపోయి బడుగుల రాజ్యం వచ్చేరోజు తొందర్లోనే ఉందన్నారు. వచ్చేది బీసీల రాజ్యమేనని, ఆ దిశలో తగిన కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించని రాజకీయ పార్టీలను రాబోయే ఎన్నికల్లో పాతరేస్తామని చెప్పారు. అన్ని బిల్లులు తెస్తున్న కాంగ్రెస్ పార్టీ బీసీల బిల్లు ఎందుకు తేవడం లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల తర్వాత బీసీని ముఖ్యమంత్రిని చేయకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
 
 సదస్సు తీర్మానాలివే..
      శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో యూపీఏ ప్రభుత్వం బీసీల కోసం బిల్లు తేవాలి. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.
     రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించాలి. జనాభా ప్రాతిపదికన 150 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాలను బీసీలకు కేటాయిస్తూ విధాన నిర్ణయం తీసుకోవాలి.
     బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణచేయాలి. ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీలకు కూడా అత్యాచార నిరోధక చట్టం తీసుకురావాలి.
     కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంతో పాటు బీసీల బడ్జెట్‌ను రూ.20వేల కోట్లకు పెంచాలి.

మరిన్ని వార్తలు