జీపీఎఫ్‌లోకి డీఏ బకాయిలు

12 Feb, 2016 03:05 IST|Sakshi
జీపీఎఫ్‌లోకి డీఏ బకాయిలు

* డీఏ సొమ్ములు అందేది ఏప్రిల్‌లోనే
* రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.144 శాతం పెంపు
* 8.908 శాతం నుంచి 12.052 శాతానికి పెరుగుదల
* పీఆర్సీ తర్వాత తొలి డీఏ ప్రకటన
* 15 నెలల బకాయిలు ఏప్రిల్ 1న చెల్లింపు

సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కరువు భత్యం (డీఏ) పెంపు జీవో వెలువడింది. డీఏను 3.144 శాతం పెంచుతూ ప్రభుత్వం గురువారం పూర్తిస్థాయి జీవో విడుదలచేసింది.

బుధవారం రాత్రి పొద్దుపోయాక డీఏ జీవో నంబర్ అప్‌లోడ్ చేయడానికే పరిమితమైన ఆర్థిక శాఖ.. పూర్తి కాపీని గురువారం ఆన్‌లైన్‌లో ఉంచింది. 2015 జవవరి నుంచి డీఏ పెంపు అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ 8.908 శాతం నుంచి 12.052 శాతానికి పెరిగింది. 2015 జనవరి నుంచి 2016 ఫిబ్రవరి వరకు.. 14 నెలల బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు.

మార్చి నుంచి నగదు రూపంలో ఉద్యోగులకు చెల్లించనున్నారు. అంటే ఏప్రిల్ 1న అందనున్న జీతంతో పాటు కరువు భత్యం ఉద్యోగులకు నగదు రూపంలో అందనుంది. 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి డీఏ బకాయిల్లో 10 శాతం ‘చందాతో కూడిన పెన్షన్ పథకం’ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాశ్వత ఖాతాలో జమ చేయనున్నారు. బకాయిల్లో మిగతా 90 శాతాన్ని నగదు రూపంలో ఇవ్వనున్నారు. ఈ ఏడాది జూన్ 30న లేదా అంత కంటే ముందు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు మొత్తం డీఏ బకాయిలను నగదు రూపంలోనే చెల్లించనున్నారు.

2010 పీఆర్సీ స్కేళ్లలో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 77.896 శాతం నుంచి 83.032 శాతానికి పెరగనున్నాయి. 2005 పీఆర్సీ స్కేళ్లలో కొనసాగుతున్న ఉద్యోగులకు 191.226 శాతం నుంచి 201.558 శాతానికి పెరగనున్నాయి. 1999 పీఆర్సీ స్కేళ్ల ప్రకారం జీతాలు తీసుకొంటున్న ఉద్యోగులకు 196.32 శాతం నుంచి 205.318 శాతానికి డీఏ పెరగనుంది. ఐదో జ్యుడీషియల్ వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు పొందుతున్న జ్యుడీషియల్ అధికారుల డీఏ 212 శాతం నుంచి 223 శాతానికి పెరగనుంది.

పద్మనాభన్ కమిటీ నివేదిక ప్రకారం జీతాలు తీసుకుంటున్న జ్యుడీషియల్ అధికారుల డీఏ 107 శాతం నుంచి 113 శాతానికి పెరగనుంది. 2006 యూజీసీ స్కేళ్లలోని ఉద్యోగులకు డీఏ 107 శాతం నుంచి 113 శాతానికి, 1996 యూజీసీ స్కేళ్లు పొందుతున్న ఉద్యోగులకు 212 నుంచి 223 శాతానికి డీఏ పెరగనుంది. గ్రామ సేవకులు, పార్ట్‌టైం అసిస్టెంట్లకు రూ. 100 పెరగనుంది.
 
పెన్షనర్లకు డీఆర్ పెంపు
పెన్షనర్లకు 2015 జనవరి నుంచి 3.144 శాతం కరవు భృతి (డీఆర్) పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. డీఆర్ పెంపు జీవో ఒకట్రెండు రోజుల్లో వెలువడనుంది. 2015 జనవరి నుంచి 2016 మార్చి వరకు 15 నెలల బకాయిలను ఏప్రిల్ 1న పెన్షన్‌తో పాటు నగదు చెల్లించనున్నారు. పాత పేస్కేళ్ల ప్రకారం పెన్షన్లు పొందుతున్న వారికి డీఏ తరహాలోనే డీఆర్ పెరగనుంది.
 
రెండో డీఏ ఎప్పుడో..
ఏటా జనవరి, జూలైలో డీఏ పెంచుతారు. 2015 జనవరి నుంచి ఇవ్వాల్సిన డీఏ ఇన్నాళ్లకు ఇచ్చారు. జూలై నుంచి ఇవ్వాల్సిన రెండో డీఏ ఎప్పుడిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. రెండో డీఏ కూడా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2016 జనవరి నుంచి మూడో డీఏ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి వచ్చే నెల్లో ప్రకటించే అవకాశం ఉంది. కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఏ మంజూరు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు