టీడీపీలో కలకలం రేపిన పురందేశ్వరి లేఖ

4 Apr, 2017 13:40 IST|Sakshi
టీడీపీలో కలకలం రేపిన పురందేశ్వరి లేఖ

న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురేందేశ్వరి లేఖ రాయడం టీడీపీలో కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు స్థానం కల్పించడాన్ని లేఖలో ఆమె తప్పుబట్టారు. ఏపీ, తెలంగాణలో ఫిరాయింపుల చట్టం అపహాస్యం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఏపీలో ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదని స్పష్టం చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తే పార్టీ ఇమేజ్ దెబ్బ తింటుందని హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి కఠినచట్టం తేవాలని కోరారు.

ఏపీ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణలో వైఎస్సార్ సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టడం విమర్శలకు తావిచ్చింది. పార్టీ ఫిరాయించిన మంత్రి పదవులు ఎలా ఇస్తారని ప్రతిపక్షాలు గట్టిగా నిలదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రానికి, బీజేపీ జాతీయ అధ్యక్షుడికి పురందేశ్వరి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు