మహిళా నాయకత్వంతోనే సమాజ శాంతి

11 Feb, 2017 01:41 IST|Sakshi
మహిళా నాయకత్వంతోనే సమాజ శాంతి

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, నోబెల్‌ గ్రహీత దలైలామా
- ప్రేమ, జాలిని ప్రోత్సహించడంలో మాతృమూర్తిని మించిన వారు లేరు
- అలాంటి వారి పట్ల వివక్ష తగదు.. సమస్యలకు చర్చే పరిష్కారం
- మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి
- ప్రస్తుత విద్యా వ్యవస్థ అంతా వ్యాపారమయం
- మనసు ప్రశాంతంగా ఉంటే బాహ్య ప్రపంచమూ బాగుంటుంది


పవిత్ర సంగమం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
ఈ ప్రపంచంలోని సగం దేశాలకైనా మహిళలు నాయకత్వం వహించినప్పుడే సమాజం శాంతియుతంగా ఉంటుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, నోబెల్‌ గ్రహీత దలైలామా హితవు పలికారు. వ్యథాభరిత సమాజం నుంచి విముక్తి కావాలని ఆకాంక్షించారు. మానవతా విలువల్ని ప్రోది చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 20వ శతాబ్దంలో తప్పు ఎక్కడ దొర్లిందో విశ్లేషించాల్సిన తరుణమిదేనన్నారు. వేదన, క్షోభ స్థానంలో జాలి, దయ వంటి లక్షణాలున్న సమాజ స్థాపన కోసం పాటుపడాలన్నారు. విజయవాడకు సమీపంలోని పవిత్ర సంగమంలో శుక్రవారం ప్రారంభమైన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరైన దలైలామా కీలకోపన్యాసం చేశారు.

‘నేను మామూలుగా సోదరీ సోదరులారా అని సమావేశాలను ప్రారంభిస్తుంటాను. కానీ ఈసారి ఓపక్క వేదికపై పెద్దక్కలు, సోదరీ మణులు, మరికొందరు సోదరులు ఉన్నందున ఎల్డర్‌ సిస్టర్స్, సిస్టర్స్, ఫ్యూ బ్రదర్స్‌ అంటూ ప్రారంభిస్తున్నా. ఏమైనా మనమందరం మానవులం. మనందరికీ మానసిక, భౌతిక, భావోద్వేగాలుంటాయి. మానవత్వమే మానవ సమాజ సందేశం. సమాజంలో చాలా సమస్యలుంటాయి. ఇవేవీ అప్పటికప్పుడు శైశవ దశలో సృష్టించినవి కావు. ఎదుగుతున్న క్రమంలో వచ్చినవే జాతి, మతం, విశ్వాసం, విరోధం, స్త్రీ, పురుష వివక్ష తదితరాలు. కానీ ప్రాథమికంగా మనమందరం ఒక్కటే. పటిష్టమైన విశ్వాసాలు, మానవులందరూ ఒక్కటేనన్న భావన ప్రాతిపదికన నిజమైన సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించాలన్నది నా అభిమతం. స్త్రీ కూడా మనిషే. సమాజ పరిణామ క్రమంలో కుటుంబాలతో పాటు జనసాంద్రత పెరిగింది. వ్యవసాయ వ్యవస్థలు వచ్చాయి. దాంతోపాటే సమాజంలో చోరీలు, దోపిడీలు వంటి అవలక్షణాలు అధికమయ్యాయి. వీటిని నియంత్రించేందుకు నాయకత్వం కావాల్సి వచ్చింది. అప్పుడు విద్య లేదు కనుక భౌతికంగా ఎవరు శక్తివంతులైతే వారి చేతికే నాయకత్వం దక్కేది. మతం పుట్టుక కూడా ఆ దశలో నుంచి వచ్చిందే. ఇప్పుడు వాటిని సమీక్షించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది’అన్నారు.

ప్రేమ, జాలి, క్షమ గుణాలున్న విద్య అవసరం
ప్రస్తుత విద్యా వ్యవస్థ వ్యాపారమయమై, భౌతిక అవసరాలే ప్రాతిపదికగా ఉందని దలైలామా ఆవేదన వ్యక్తం చేశారు. ‘మానవ విలువలకు స్థానం లేకుండా పోతోంది. ఎంతసేపూ ఆదాయం, డబ్బు చుట్టూనే తిరుగుతోంది. జాలి, దయ కలిగిన మానవ సమాజాన్ని సృష్టించాలి. ప్రేమ, జాలి, కనికరం, క్షమ వంటి విషయాలున్న విద్య నేటి అవసరం. ఇటువంటి విలువల్ని ప్రోత్సహించడంలో మాతృమూర్తిని మించిన వారు లేరు. అటువంటి వ్యక్తి పట్ల వివక్ష తగదు. గత శతాబ్దంలో జరిగిన హింస, వివక్షకు తావులేకుండా ప్రస్తుత 21వ శతాబ్దాన్ని నిర్మించుకోవాలి. చిన్న తనం నుంచే మానవతా విలువలు నేర్పాలి. మితిమీరిన హింసకు, మానవ హననానికీ తావు లేకుండా చూడాలి. జాతి, మతం, వర్ణం, వివక్ష పేరిట జరిగే హింసపై మనం ఆలోచించాల్సిన సమయం ఇది. 21వ శతాబ్దంలో శాంతియుత సమాజం కావాలి. దానికి మనశ్శాంతి అవసరం. అది ఉన్నప్పుడు సమాజ శాంతి కూడా సాధ్యమవుతుంది. ఈ శతాబ్దం కేంద్ర బింధువు చర్చ (డైలాగ్‌) కావాలి. తప్పుడు అభిప్రాయాలతో కాకుండా అవగాహనతో ముందుకు సాగాలి. చర్చలు, సంప్రదింపులే పరిష్కార మార్గాలు. ఆయుధం లేని సమాజం కావాలి. ఈ ప్రపంచం నిరాయుధ ప్రపంచంగా ఉండాలి. అది మన మనస్సుతోనే ప్రారంభం కావాలి. ఇతరుల బాధ, క్షోభను అర్థం చేసుకోవడంలో మహిళలు చాలా సున్నితంగా ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ భూగోళంపై 200 దేశాలున్నాయి. మహిళా నేతలు మరింత మంది వస్తే ఈ ప్రపంచం అంత భద్రంగా ఉంటుంది. అందుకే మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంద’న్నారు.

మరిన్ని వార్తలు