డేంజర్ గేమ్..పోకెమాన్ గో..

24 Jul, 2016 04:23 IST|Sakshi
డేంజర్ గేమ్..పోకెమాన్ గో..

ప్రపంచాన్ని పిచ్కెక్కిస్తున్న మొబైల్ గేమ్
మొబైల్‌ని చూస్తూ తిరగాల్సి రావటంతో ప్రమాదాలు

 
- తొలిసారి వర్చువల్ రియాలిటీతో అనుసంధానం
- రోడ్లపై డ్రైవింగ్‌లోనూ ఆటే; ప్రమాదాలు- పోలీసుల హెచ్చరిక
- అమెరికాలో శ్మశానంలో ఇరుక్కున్న మహిళ
తమను గుర్తుపట్టేశాడని యువకుడిని కాల్చేసిన దుండగులు
ఇండియాలో మూడునాలుగు రోజుల్లో విడుదల: నింటెండో
ఇక్కడ విదేశాల మాదిరి రోడ్లపై ఆడితే చాలా ఇబ్బందికరం
- మొబైల్ సిగ్నల్స్ కూడా వీక్‌గా ఉంటాయి కనక ఇక్కడ కష్టం
- నింటెండో కంపెనీకి కిక్కిచ్చిన గేమ్; 10 రోజుల్లో షేరు డ బుల్
- పోకెమాన్ పేరున్న ప్రతి వ్యాపారానికీ భలే గిరాకీ
 
 
 స్కూలు పిల్లలే కాదు. కాలేజీ కుర్రాళ్లనైనా సరే... ఉన్నట్టుండి ‘మన రాష్ట్రపతి ఎవరు?’ అని అడిగారనుకోండి. చాలామంది కాసేపు ఆలోచిస్తారు. కొందరైతే చెప్పలేరు కూడా. కానీ వారిని... ‘పోకెమాన్ గురించి తెలుసా?’ అని అడిగారనుకోండి. గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తారు. అంతేకాదు!! నాకు 50 క్యారెక్టర్ల పేర్లు తెలుసు!! అని ఒకరంటే... నాకు 80 తెలుసు!! అని మరొకరు... ఇలా పోటీలు పడి పేర్లు కూడా చెప్పేస్తారు!!. అదీ... పోకెమాన్ పవర్.!!
 
 పోకెమాన్ అంటే జపనీస్‌లో ‘పాకెట్ మాన్‌స్టర్’కు సంక్షిప్త రూపం. ఇదో టీవీ షో. సినిమాలూ వచ్చాయి. గేమ్స్ కూడా ఉన్నాయి. పోకెమాన్ ట్రయినర్ యాష్... తన  స్నేహితులు మిస్టీ, బ్రోక్‌తో కలిసి పోకెమన్ భాగస్వాముల్ని తీసుకుని కల్పిత ప్రపంచంలో తిరగటమే ఈ షో కథ. మరి యాష్ లక్ష్యమేంటి? పోకెమాన్ మాస్టర్ కావాలి. ఈ గేమ్ ఆడే పిల్లల లక్ష్యం కూడా అదే. సాధ్యమైనన్ని పోకెమాన్లను సంపాదించి, వాటిని ట్రెయిన్ చేసి మాస్టర్ కావటమే. జంతువులు, మాయలు, అద్భుతాలు... ఇలా కావాల్సిన మసాలాలన్నీ ఉండటంతో పోకెమాన్ అంటే పిల్లలకు, యువతకు పిచ్చి.
 
 జూలై 6న పోకెమాన్ ప్రపంచంలో ఓ సంచలనం!! ఇంకా చెప్పాలంటే... పోకెమాన్ ప్రపంచం మొత్తం ఓ అడుగు ముందుకేసింది. మొబైల్ గేమింగ్ స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తూ... అగ్‌మెంటెడ్ రియాలిటీ ఆధారిత ‘పోకెమాన్ గో’ గేమ్ కొన్ని దేశాల్లో విడుదలయింది.

 నిజం చెప్పాలంటే... అగ్‌మెంటెడ్ రియాలిటీ
 ఆధారంగా రూపొందిన తొలి పాపులర్ గేమ్ ఇదే. ఇది విడుదలైన క్షణంలోనే... మొబైల్ గేమ్స్ అభిమానుల క్రేజ్ తారస్థాయికి వెళ్లిపోయింది. క్షణాల్లోనే వేల డౌన్‌లోడ్లు. రోజులు తిరక్కుండానే అవి లక్షలుగా మారిపోయాయి. వారం తిరక్కుండా కోట్లు దాటిపోయాయి. ఇండియా సహా పలు దేశాల్లో ఇది ఇంకా విడుదల కాకపోయినా... ఇప్పటికే గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ప్లేస్టోర్లలో అత్యధిక డౌన్‌లోడ్లు చేసుకున్న గేమ్‌గా రికార్డులు బద్దలుగొట్టేసింది. అంతేకాదు!! పలు దేశాల్లో వివాదాలకూ కారణమవుతోంది. కొన్ని దేశాలైతే నిషేధించాయి కూడా!! మరి ప్రపంచాన్ని ఇంతలా పిచ్కెక్కిస్తున్న ఈ గేమ్ విశేషాలేంటి? ఎందుకింత క్రేజ్ ? అసలు ఇండియాలో ఎప్పుడు విడుదలవుతుంది? ఒకవేళ ఇండియాలో విడుదలైతే మిగతా దేశాల్లాగే మనమూ ఆడగలమా? ఇవన్నీ వివరించేదే
 ఈ వారం ‘ఫోకస్’...    - సాక్షి, బిజినెస్ విభాగం
 
 సాధారణంగా ఏ మొబైల్ గేమైనా స్థిరంగా ఒకచోట కూర్చుని ఆడేదే. కానీ ‘పోకెమాన్ గో’ అలా కాదు. నడుస్తూ... వాహనాలపై ఎక్కడెక్కడికో వెళుతూ... మొత్తంగా కదులుతూ ఆడే గేమ్. ఈ గేమ్ ఆడాలంటే మొదట గూగుల్ లేదా యాపిల్ ప్లేస్టోర్ల నుంచి ‘పోకెమాన్ గో’ ఫ్రీ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. కాకపోతే ఇండియాలో ఇంకా ఇది విడుదల కాలేదు కనక... ‘మీ దేశంలో ఇది లభ్యం కావటం లేదు’ అనే సందేశం మాత్రం వస్తుంది. కాస్త టెక్నాలజీ పరంగా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నవారైతే... ఏ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌కో అనుసంధానమై దీన్ని డౌన్‌లోడ్ చేసేయొచ్చు. కాకపోతే అధికారికంగా విడుదలయ్యాకే దీన్లోని ఫీచర్లన్నీ లభిస్తాయని కంపెనీ చెబుతోంది. ఇండియాలో వచ్చేవారంలోనే విడుదల చేస్తామని కూడా వెల్లడించింది.
 
 మరి దీన్నెలా ఆడాలి..?
  డౌన్‌లోడ్ చేసి లాగిన్ అయ్యాక... మీరు పోకెమాన్ ట్రెయినర్‌గా మారాలి. హెయిర్ నుంచి స్కిన్, కళ్లు, దుస్తులు, స్టయిల్స్‌తో సహా ఒక అవతార్‌ను ఎంచుకోవాలి. లొకేషన్‌ను ఆన్ చేస్తే... ఆ వెంటనే మీరున్న చోటు ఫోన్లో మ్యాప్స్ ద్వారా కనిపిస్తుంటుంది. అదే మ్యాప్‌లో పోకెమాన్లు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఎక్కడ ఉన్నాయనేది కరెక్ట్‌గా తెలియకపోయినా... ఎంత దూరంలో ఉన్నాయనేది తెలుస్తూ ఉంటుంది. సదరు ప్రాంతానికి నిజంగా వెళితేనే కనిపిస్తాయవి. దీంతో... మనం ఫోన్ పట్టుకుని, కెమెరాలోంచి చూస్తూ ముందుకు వెళ్లాలన్న మాట. ఎక్కడైనా పోకెమాన్ ఉన్న ప్రదేశంలోకి వెళ్లగానే... ఫోన్లోని కెమెరా నుంచి చూస్తాం కనక... ఆ కెమెరా, గైరోస్కోప్ ఆధారంగా అగ్‌మెంటెడ్ రియాలిటీ  ద్వారా పోకెమాన్ చిత్రం మొబైల్‌లో కనిపిస్తుంది. మన ఎదురుగా కనిపిస్తున్న పోకెమాన్‌ని... ఫోన్లోని పోకెబాల్‌తో కొట్టాలి. ఈ బాల్ ఎలా ఉంటుందంటే గూగుల్ మ్యాప్స్‌లో పిన్ మాదిరి. కావాలంటే ఆటగాళ్లు పోకెమాన్‌లను ఫొటోలు కూడా తీసుకోవచ్చు.

 ఈ పోకెమాన్లు ఎక్కడుంటాయి?
 రోడ్డు మీద, రెస్టారెంట్ల పక్కన, నీటిలో, కొండల మీద, అడవిలో, బస్టాప్‌ల వద్ద, ఆసుపత్రుల  వద్ద... ఇలా ఎక్కడైనా పోకెమాన్స్ ఉండొచ్చు. సరైన సమయంలో సరైన బాల్‌ను వినియోగించడంపైనే ఆటగాడి సామర్థ్యం ఆధారపడి ఉంటుంది.

 ఎన్‌కౌంటర్ చేసిన తరువాతో..?
 పోకెమాన్‌లను ఎన్‌కౌంటర్ చేశాక ఆటగాడికి రెండు రకాలుగా పాయింట్లొస్తాయి. 1. క్యాండీస్ 2. స్టార్‌డస్ట్. పోకెమాన్ పోరాట శక్తిని పెంచేందుకు ఆటగాడు అవసరమైతే క్యాండీస్, స్టార్‌డస్ట్ పాయింట్లను వినియోగించుకోవచ్చు. అన్ని పోకెమాన్ల శక్తీ ఒకేలా ఉండదు. లెవల్స్ పెరుగుతున్న కొద్దీ వాటి శక్తి కూడా ఆటోమెటిక్‌గా పెరుగుతుంది. అవసరమైతే ఆటగాడు పోకెమాన్‌ను తిరిగి వెనక్కి పంపించి మరో పోకెమాన్‌ను సృష్టించుకునే వీలుంటుంది.

 ఈ ఆట ముగిసేదెక్కడ?
 ఐదు లెవల్స్ దాటాక ఆటగాడు వలోర్- రెడ్ టీం, మైస్టిక్- బ్లూ టీం, ఇన్‌స్టింక్ట్- ఎల్లో.. ఈ మూడు జట్లలో చేరొచ్చు. దీంతో పోకెమాన్ జిమ్‌లో తలపడటానికి అర్హత సాధిస్తాడన్నమాట. ఈ జిమ్‌లు కూడా రియల్ లొకేషన్లలోనే ఉంటాయి. అక్కడకు వెళితే కనిపిస్తాయి. జిమ్ మీద ఆధిపత్యం సాధించి, జిమ్‌లో శిక్షణ ద్వారా తన పోకెమాన్స్‌ను బలోపేతం చేయొచ్చు.

  పోకెమాన్ గోలో మొత్తం 151 పోకెమాన్ ర్యాంకింగ్స్ ఉంటాయి. ప్రతీదానికో పేరుంది. ఫస్ట్ పోకెమాన్ పికాచు. తర్వాత మ్యూ, చార్మెండర్, హంటర్.. ఇలా జుబట్, ప్రిడ్జి, రట్టాటాతో ముగుస్తుంది. ఈ గేమ్ అంతిమ విజయం ఏంటంటే.. పొకెడెక్స్‌లో బందీలుగా ఉన్న పోకెమాన్‌లను విడిపించడమే.
 
 మన దేశంలో ఆడగలమా?
► ఇండియాలో ఇంకా ఈ గేమ్ విడుదల కాలేదు. విడుదలైనా సరే... ఆడటంలో చాలా ఇబ్బందులుండవచ్చనేది నిపుణుల మాట. ఎందుకంటే ఈ గేమ్‌కోసం వీధుల్లో తిరగాల్సి ఉంటుంది. మనుషులు మామూలుగా నడవటానికే వీలుకాని మన రోడ్లపై... ఫోన్‌వైపు చూస్తూ నడిస్తే ఇంకేమైనా ఉందా? విదేశాల్లో కన్నా ఎక్కువ ప్రమాదాలు ఇక్కడే జరిగే అవకాశం ఉంటుందన్నది వారి భావన.
► ఈ గేమ్‌ను వీధుల్లో తిరుగుతూ ఆడాలి కనక వైఫైతో సాధ్యం కాదు. 2జీతో ఆడలేం. 3జీ లేదా 4జీ డేటాను వాడాల్సి ఉంటుంది. మన దేశంలో 3జీ సిగ్నల్స్ చాలా చోట్ల పనిచేయవు. అందుకని ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవాల్సి ఉంటుంది. వీక్ సిగ్నల్ కారణంగా చాలా ప్రాంతాల్లో ఆడే అవకాశం ఉండదు. సిగ్నల్ బలంగా ఉన్నచోట ఆడదామనుకుంటే అక్కడ పోకెమాన్లు, పోకె జిమ్‌లు ఉండక పోవచ్చు.
► మనదేశమే కాదు. ఎక్కడైనా బ్యాటరీ సమస్యే. ఎందుకంటే కెమెరా, జీపీఎస్ ఒకేసారి వినియోగిస్తూ ఈ గేమ్ ఆడాలి. దీంతో బ్యాటరీ ఎక్కువ ఖర్చవుతుంది. గంట సేపు ఆడితే బ్యాటరీ మొత్తం ఖాళీ అయిపోయే ప్రమాదముంది. అందుకని వేరే బ్యాటరీని వెంట తీసుకెళ్ళాలనేది గేమర్ల సూచన.
► బెంగళూరులోని బాబాజాబ్స్ సంస్థ ఇప్పటికే ‘పోకెమాన్ క్యాచర్స్’ కావాలంటూ కొత్త ఉద్యోగ ప్రకటన వేసిం ది. అంటే కాస్త బలంగా ఉండి అటూ ఇటూ పరుగులెత్తి పోకెమాన్లను పట్టుకుంటే... వాటిని విక్రయిస్తారన్న మాట.
► కొన్ని లెవెల్స్ చేరుకున్న వారు తమ ఖాతాల్ని కూడా ఆన్‌లైన్లో విక్రయిస్తున్నారు. వాటిని కొంటే... నిజంగా పోకెమాన్లను పట్టుకోకపోయినా మన ఖాతాలోకి వచ్చేస్తాయన్న మాట.
► పోకెమాన్ పేరిట ఇప్పటికే దుస్తులతో పాటు క్యాప్‌లు, కార్డ్‌లు, స్కూల్ బ్యాగ్‌ల వంటి రకరకాల యాక్సెసరీలు మార్కెట్లో ఉన్నాయి. తాజా గేమ్‌తో వాటి గిరాకీ అమాంతం పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.
► పోకెమాన్ వస్తువులమ్మే ప్రతి వ్యాపారానికీ గి రాకీ పెరిగింది. పోకెమాన్ బొమ్మలతో కేకు లు తయారు చేస్తున్న ఓ బేకరీ షేరు జపాన్‌లో 10 రోజుల్లోనే 50% పెరిగింది.
 
 ప్రమాదాలే ప్రమాదాలు..!
► పోకెమాన్ గోపై భిన్న స్పందనలున్నాయి. ఈ గేమ్‌ను నడుస్తూ, పరుగెడుతూ ఆడతారు కనక.. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యకరమైనదేనని కొందరు చెబుతున్నారు. అయితే రోడ్లు మీద వెళుతూ ఆడాల్సిన గేమ్ కావటంతో ప్రమాదకరమని మరికొందరు చెబుతున్నారు.
► నిజానికి ఇప్పటికే పోకెమాన్ గేమ్ వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. న్యూజెర్సీకి చెందిన ఓ మహిళ పోకెమాన్లను వెతుకుతూ... ఏకంగా దగ్గర్లోని స్మశానంలోకి వెళ్లిపోయింది. పోకెమాన్లను పట్టుకునే క్రమంలో అక్కడ చెట్ల మధ్య ఇరుక్కుపోయింది. చివరకు పోలీసులొచ్చి ఆమెను రక్షించాల్సి వచ్చింది.
► స్టోర్‌బ్రిడ్జ్‌లో ఓ వ్యక్తి పోకెమాన్ గో ఆడుతూ... రోడ్డుపైకి చూడటానికి బదులు మొబైల్‌వైపు చూస్తూ డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే పోలీసులు కూడా పట్టుకున్నారు. చివరకు పోకెమాన్ గో ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ... కొన్ని జాగ్రత్తలు చెబుతూ క్లీవ్‌లాండ్ పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు.
► గ్వాటెమాలాలో ఇద్దరు అన్నదమ్ములు పోకెమాన్ ఆడుతూ ఓ ప్రాంతానికి వెళ్లారు. అక్కడున్న దుండగులు తమను జీపీఎస్ సాయంతో వెతుకుతూ వచ్చేశారని భావించి ఇద్దరిలో ఒకరిని కాల్చిచంపేశారు.
► నార్త్ టెక్సాస్‌లో పోకెమాన్ ఆడుకుంటూ నిర్జీవ ప్రదేశానికి వెళ్లిన వ్యక్తిని పాము కాటేసింది. ఇదే ప్రాంతంలో మరొక వ్యక్తి అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. మరొక వ్యక్తి పోలీస్ వాహనానికి ఢీకొన్నాడు. దీంతో నార్త్ టెక్సాస్ పోలీస్ విభాగం పోకెమాన్ గేమ్- భద్రత చిట్కాలను వివరిస్తూ నిమిషం నిడివిగల వీడియోను విడుదల చేసింది.
► మరోవైపు శుక్రవారం కెనడాలో పోకెమాన్ గో ఆడుతూ ఇద్దరు టీనేజర్లు దేశ సరిహద్దులు దాటి అమెరికాలో ప్రవేశించారు. వారిని బోర్డర్ పెట్రోల్ సిబ్బంది అదుపులోకి తీసుకుని వెనక్కి తీసుకొచ్చారు.
► ఒకవైపు ప్రమాదాలు పెరుగుతుండగా... ఇదొక జూదం లాంటిదంటూ దీన్ని నిషేధించాలని సౌదీ అరేబియా కౌన్సిల్ ఆఫ్ సీనియర్ స్కాలర్స్ ఫత్వా జారీ చేశారు. ఇది అనారోగ్యకరమని ఈజిప్ట్ రాజధాని కైరోలోనూ నిషేధించారు.
 
 ఇంగ్రెస్ గేమ్ డేటాతోనే పోకెమాన్
 నియాంటిక్ మూలాలు గూగుల్‌వే. ఈ సంస్థ 2012లోనే ఇంగ్రెస్ గేమ్‌ను రూపొందించింది. కానీ అది పట్టాలెక్కలేదు. గూగుల్ కాస్తా ఆల్ఫాబెట్‌గా మారాక నియాంటిక్ సంస్థ పూర్తిగా విడిపోయింది. పోకెమాన్ సీఈఓ ట్సునికాజు ఐషిహారా, నింటెండో ప్రెసిడెంట్ అండ్ సీఈఓ సటోరూ ఐవాటా కలిసి... అగ్‌మెంటెడ్ రియాలిటీతో గేమ్ రూపొందించాలనుకున్నారు. నియాంటిక్‌తో చేతులు కలిపారు. ఇంగ్రెస్‌ను దీనికి వాడుకున్నారు. ఈ గేమ్ గురించి అగ్‌మెంటెడ్, వర్చువల్ రియాలిటీలో ఉన్న ఇమాజినేట్ సంస్థ సీఈఓ హేమంత్ సత్యనారాయణ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

 + జీపీఎస్, కెమెరా, ఫోన్‌లోని కంపాస్ ఆధారంగా వర్చువల్ వరల్డ్‌లో భౌగోళిక ప్రాంతాల్ని గుర్తిస్తారు. ఇందులో అగ్‌మెంటెడ్  రియాలిటీ ద్వారా పోర్టల్స్‌ను ట్రాక్ చేసిపెడతారు. వీటిని నావిగేషన్ చేయాలంటే వాస్తవ ప్రపంచంలో వాటి వద్దకు వెళ్లాలి. మొబైల్‌లోని దిక్సూచి, సెన్సార్ కనెక్ట్ అయి ఉంటాయి కనక.. యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న మొబైల్‌ను వెంట తీసుకెళ్లాలి.
 అయితే ఇక్కడ మనకొక సందేహం రావొచ్చు. అదేంటంటే.. పోకెమాన్ కోసం బహిరంగ ప్రదేశాల్లో తిరగాల్సి ఉంటుందని డెవలపర్లకు ముందే తెలిసినప్పుడు నిర్మానుష్య ప్రదేశాల్లో, ఓపెన్ ప్లేసుల్లోనో ఈ పోకెమాన్లను పెట్టొచ్చు కదా అని!. కరెక్టే.. కానీ పోకె మాన్లను వారెలా నావిగేట్ చేశారు? గూగుల్ ఏపీఐ ద్వారా కదా! అంటే ఎక్కడైతే పది మంది గుంపులుగా ఉంటారో అక్కడే పోకెమాన్‌లను పెట్టారు. బస్టాండ్లు, పార్కులు, మైదానాలు, రెస్టారెంట్ల వంటివన్నమాట.
 + ప్రపంచం మొత్తం మీద పోకెమాన్లను మాన్యువల్‌గా పెట్టలేం. గూగుల్ మ్యాప్స్‌లో ప్రతి పాయింట్‌ను ఎంచుకుని కూడా చేయలేం. అందుకే డెవలపర్లు ఏం చేశారంటే.. రాండమ్‌గా బస్టాండ్లు, పార్కులు, మైదానాలు, రెస్టారెంట్లు, ఆసుపత్రుల వంటి ప్రాంతాలను ఎంచుకున్నారు. అక్కడ గూగుల్ అప్లికేషన్ ప్రొగ్రాం ఇంటర్‌ఫేస్ (ఏపీఐ) ద్వారా పోకెమాన్లను పెట్టేశారు. అయితే కొన్ని సందర్భాల్లో గూగుల్ మ్యాప్స్, ఏపీఐ రెండూ నావిగేషన్స్ కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. అక్కడ డెవలపర్లు అనుకున్న ప్రాంతం ఒకటైతే వాస్తవంగా వేరే ప్రాంతం ఉండొచ్చు. ఇదీ అసలు మ్యాటర్!!
 
 నకిలీలున్నాయ్ జాగ్రత్త..
► పోకెమాన్ గో విడుదలైన రెండు రోజుల్లో నే యాపిల్, ఆండ్రాయిడ్ స్టోర్లలో ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న గేమ్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. వారం రోజుల్లో 10 మిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం పోకెమాన్‌కు 35 మిలియన్ల యూజర్లున్నారని సెన్సార్ టవర్ లెక్కలు చెబుతున్నాయి.
► పోకెమాన్ గో ఆధారం చేసుకొని పోకె రా డార్, హెల్పర్ ఫర్ పోకెమాన్ గో వంటి 215 నకిలీ యాప్స్ చెలామణిలోకి వచ్చాయి. వీటి ని డౌన్‌లోడ్ చేసుకుంటే పలు వైరస్‌లు డౌన్‌లోడ్ అవుతాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ రిస్కీఐక్యూ హెచ్చరించింది. నకిలీ యాప్స్‌తో ఫోన్‌లోని డేటా బదిలీ అవుతుంది. మొబైల్ వ్యాలెట్లపై దాడి చేస్తుండటంతో ఆర్థికంగానూ నష్టపోయే ప్రమాదముంది.
►ఆండ్రాయిడ్ ఫోన్లలో రోజుకు సగటున ఈ గేమ్ వినియోగం స్నాప్‌చాట్, టిండర్, ట్విటర్, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ వినియోగాన్ని మించిపోయింది. ఐఓఎస్ ఫోన్లలో సగ టున రోజుకు 33 నిమిషాల 25 సెకన్ల పాటు ఈ గేమ్‌ను ఆడుతున్నారు. అదే ఫేస్‌బుక్‌ను 22 నిమిషాల 8 సెకన్లు, స్నాప్‌చాట్‌ను 18 నిమిషాల 7 సెకన్లు మాత్రమే వినియోగిస్తున్నారు.
 
 పోకెమాన్ సిరీస్ ఇవే...
 1996లో పోకెమాన్ రెడ్ అండ్ బ్లూతో ప్రారంభమైన ఈ సిరీస్ మొదలైంది. తరవాత పలు ఎడిషన్ల అనంతరం... ఈ జూలై 6న పోకెమాన్ గో విడుదలైంది. నవంబరులో పోకెమాన్ సన్ అండ్ మూన్ కూడా విడుదలకానుంది.
 
 30కి పైగా దేశాల్లో విడుదల

 జూలై 6న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికాల్లో విడుదలయింది. తరవాత జర్మనీ, యూకే, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్... ఇలా 30కి పైగా దేశాల్లో విడుదలయింది. శనివారంనాడు జపాన్‌లో విడుదల సందర్భంగా... మూడు నాలుగు రోజుల్లో ఇండియాలోనూ విడుదల చేస్తామని దీని సృష్టికర్త నింటెండో సంస్థ ప్రకటించింది. సర్వర్లకు అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో ఒకేసారి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయలేదు.
 
 నింటెండో షేరు పరుగులు..
 పోకెమాన్ సిరీస్ సృష్టికర్త జపాన్‌కు చెందిన నింటెండో. అమెరికాకు చెందిన నియాంటిక్ సహకారంతో నింటెండో ఈ గేమ్‌ను విడుదల చేసింది. జూలై 6న విడుదల చేసేనాటికి నింటెండో మార్కెట్ విలువ 20 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ షేరు పరుగులు పెట్టడంతో సంస్థ విలువ జూలై 20 నాటికి ఏకంగా 42 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే... రెట్టింపుకన్నా ఎక్కువన్న మాట. ప్రస్తుతం నింటెండోకు ఈ గేమ్ ద్వారా రోజుకు 2 మిలియన్ డాలర్ల... (రూ.14 కోట్ల) ఆదాయం సమకూరుతున్నట్లు అంచనా.

మరిన్ని వార్తలు