ఢిల్లీలో మరో కీచకం

16 Jan, 2014 21:49 IST|Sakshi
ఢిల్లీలో మరో కీచకం

డెన్మార్క్ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారం
విలువైన వస్తువులు, నగదు దోపిడీ
ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

 
 న్యూఢిల్లీ: దేశ రాజధాని మహిళలకు ఏమాత్రం సురక్షితం కాదని మరోసారి రుజువైంది. భారత్ అందాలను చూసి వెళదామని వచ్చిన డెన్మార్క్ మహిళపై కొందరు దుండగులు కీచకానికి తెగబడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి బుధవారం రాత్రి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. డెన్మార్క్‌కు చెందిన 51 ఏళ్ల మహిళ ఈనెల 1న భారత పర్యటనకు వచ్చింది. ఆగ్రా తదితర ప్రాంతాలను సందర్శించిన తర్వాత సోమవారం ఢిల్లీకి చేరుకుంది. ఆమె మంగళవారం నేషనల్ మ్యూజియంను తిలకించి, సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కన్నాట్ ప్లేస్ నుంచి పహాడ్‌గంజ్‌లోని హోటల్‌కు వెళుతూ దారి తప్పింది. హోటల్‌కు చేరుకునేందుకు తోవలో కనిపించిన కొందరు యువకుల సాయం కోరింది.
 
  హోటల్ చూపిస్తామంటూ వారు న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుపోయి, కత్తులతో బెదిరించి నగదు, ఐపాడ్, ఫోన్ వంటి విలువైన వస్తువులను, ఆమె వద్దనున్న నగదును దోచుకున్నారు. తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు గంటల తర్వాత నానా తంటాలు పడి హోటల్‌కు చేరుకున్న ఆమె, జరిగిన సంఘటనను మేనేజర్‌కు తెలిపారు. ఆయనకు పోలీసులకు ఫోన్ చేయడంతో వారు రాత్రి 8.30 గంటలకు హోటల్‌కు చేరుకుని, బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 376 జీ(2) కింద సామూహిక అత్యాచారంతో పాటు దోపిడీ కేసు నమోదు చేసుకున్నారు. ఆరుగురు దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
 
 కాగా, బాధితురాలు బుధవారం మధ్యాహ్నం స్వదేశానికి బయలుదేరి వెళ్లింది. స్వదేశంలో వైద్య పరీక్షలు జరిపించుకుని, నివేదిక పంపుతానని, అవసరమైతే సాక్ష్యం చెప్పేందుకు తిరిగి భారత్‌కు వస్తానని ఆమె చెప్పింది. ఇదిలా ఉండగా, ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాకు చెందిన మహేందర్ అలియాస్ గంజా (25), రాజా అనే నిందితులను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారి వద్దనుంచి ఐపాడ్, ఇయర్‌ప్లగ్, దోచుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన రూ.1200 విలువ చేసే నోకియా మొబైల్‌ఫోన్, ఒక కళ్లద్దాల కేసు, రూ.1,800 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈనెల 3న పోలండ్ మహిళపై ఒక క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడి, ఢిల్లీలోని నిజాముద్దీన్ స్టేషన్ వద్ద వదిలేసి పరారైన సంగతి తెలిసిందే.
 
 లెఫ్టినెంట్ గవర్నర్‌తో సీఎం కేజ్రీవాల్ భేటీ...
 డెన్మార్క్ పర్యాటకురాలిపై అత్యాచారం ఘటన వెలుగులోకి రావడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌తో భేటీ అయ్యారు. నగరంలో మహిళలకు భద్రత పెంచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుసుకుని, మహిళలపై నేరాల కేసులను సత్వరమే విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కోరనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.

మరిన్ని వార్తలు