హరిత రథం... అది ఒక కదిలే తోట...

31 May, 2015 04:19 IST|Sakshi
హరిత రథం... అది ఒక కదిలే తోట...

ధనుంజయ్ చక్రవర్తి కోల్‌కతాలోని ఒక ట్యాక్సీ డ్రైవర్. ఆయన ప్రత్యేకత ఏమిటంటే తన ట్యాక్సీపైనే ఒక రూఫ్ టాప్ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకొని ముద్దుగా హరిత రథం అనే పేరు పెట్టుకున్నారు. ఇందులో ఏసీ కార్లకన్నా చల్లగా ఉండటం విశేషం. మూడేళ్ల క్రితం అందమైన  మనీప్లాంట్ మొక్కతో కారులో మొక్కల పెంపకానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇప్పుడు రూ. 22 వేలు ఖర్చుచేసి అంబాసిడర్ కారుపైన తొట్టెను ఏర్పాటు చేసి మట్టితో నింపి గడ్డి పెంచుతున్నారు. దీని బరువు 65 కేజీల వరకూ ఉండటంతో వాహనం ఎక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటున్నా దీన్ని కొనసాగించటం విశేషం. కారులోపల వెనుక భాగంలోనూ ఎనిమిది కుండీల్లో మొక్కలు పెంచుతున్నాడు. తద్వారా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు తనవంతు ప్రయత్నిస్తూ.. ప్రయాణికులకు ప్రేరణనిస్తున్నారు.
 
 ఈ మొబైల్ గార్డెన్ వ్యాన్‌ను నడపటం సాధ్యంకాదని కొందరు తోటి డ్రైవర్లు ఆయన్ను నిరుత్సాహపరచినా వెనక్కు తగ్గలేదు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరు తమవంతు బాధ్యతగా మొక్కలు పెంచాలంటారు ధనుంజయ్. ఆయన ఇచ్చే కరపత్రాలు మొక్కల పెంపకంపై ప్రయాణీకుల్లో ఆసక్తిని పెంచేలా ఉంటాయి. ఐతే మొక్కల పెంపకం కోసం ఇంత తపన పడుతున్న ధనుంజయ్ చక్రవర్తికి సొంత కారు లేదు. ఎనిమిదేళ్లక్రితం యాక్సిడెంట్ కావటంతో చికిత్సకోసం కారును అమ్ముకోవాల్సి వచ్చింది. అప్పటినుంచి కిరాయి ట్యాక్సీనే నడుపుతూ దాని ద్వారానే ప్రయాణికుల్లో మొక్కల పెంపకంపై అవగాహన కలిగేంచేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. అయితే ట్యాక్సీయాజమాని అమ్రిష్ సింగ్, ధనుంజయ్ ప్రయత్నానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఈ సారి కోల్‌కతా వె ళ్లినప్పుడు తప్పకుండా హరిత రథంలో ప్రయాణిస్తారు కదూ!

మరిన్ని వార్తలు