తమిళనాడుతో అనుబంధం

31 May, 2017 02:50 IST|Sakshi
తమిళనాడుతో అనుబంధం
దాసరి మృతిని జీర్ణించుకోలేని అభిమానులు
 
తమిళ సినిమా (చెన్నై): పాలకొల్లు నుంచి తన కళను నమ్ముకుని మద్రాసు మహానగరంలో అడుగుపెట్టి, ప్రపంచం గర్వించేంత స్థాయికి ఎదిగిన దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇకలేరన్న సమాచారం తమిళనాట అభిమానుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు కళారంగానికి చెందిన వారే కాదు తమిళ సినీ ప్రముఖులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గిన్నిస్‌ రికార్డుతో తెలుగువాడి ప్రభంజనాన్ని చాటిన దాసరికి చెన్నైతో అనుబంధం చాలానే ఉంది. ఒకప్పటి మద్రాసు పట్నంలో నాటి నటీనటుల వలే దాసరి కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.

ఘోస్ట్‌ రైటర్‌గా సినీ పయనాన్ని ప్రారంభించి, అచంచల ఆత్మవిశ్వాసంతో రచయితగా, మాటల రచయితగా, చిన్న చిన్న పాత్రలు అంటూ ఒక్కోమెట్టు ఎదిగి చిత్ర పరిశ్రమలో వటవృక్షంలా ఎదిగి, ఎందరికో ఆశ్రయమిచ్చి, వారి ఎదుగుదలకు దోహదపడి దాసరి వ్యక్తి కాదు, ఒక శక్తి అని నిరూపించారు. అగ్రనటుడిగా ఎన్‌.టి.రామారావు హవా కొనసాగుతున్న తరుణంలో స్థానిక టీనగర్‌ హబిబుల్లా రోడ్డులోని ఆయన ఇంటికి ఎదురుగా ఇంటిని నిర్మించుకుని ఆయనకు ధీటుగా వెలిగారు. హీరోల హవా కొనసాగుతున్న తరుణంలో దర్శకుడే సినిమాకు కెప్టెన్‌ అని చాటిచెప్పిన దిగ్గజం దాసరి. 
 
విడదీయరాని అనుబంధం
దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, పత్రికాధిపతిగా, రాజకీయ నేతగా తమిళులకు దాసరి సుపరిచితుడే. జాతీయ పురస్కారాలు అందుకున్నా, నంది అవార్డులతో రికార్డులు సృష్టించినా తెలుగు, తమిళ భాషల్లోనూ ఆయన ఉత్తమ నటుడిగా మన్ననల్ని అందుకున్నారు. తమిళంలో  ‘అడిమై పెన్‌’ (ఒసేయ్‌ రాములమ్మ)తో అశేష అభిమాను ల్ని సంపాదించుకున్నారు. దీని తర్వాత దాసరి చిత్రాలు తమిళ అనువాదంలోకి వరుసగా క్యూకట్టాయి. అత్యధిక చిత్రాల దర్శకుడిగా, ప్రజలను ప్రభావితం చేసే ఎన్నో ఉత్తమ చిత్రాలను అందించిన దాసరి తమిళంలో ‘నక్షత్రం’ పేరుతో తొలి సినిమా తీశారు. ఇక్కడ జరిగే కార్యక్రమా లకు, వేడుకలకు తరచూ హాజరయ్యేవారు.

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్, విశ్వనటుడు కమల్‌హాసన్‌లకు దాసరితో విడదీయరాని అనుబంధం ఉంది. ముఖ్యంగా రజనీకాంత్‌ దాసరిని ‘గురువు గారు’ అంటూ సంబోధిస్తుంటారు. డీఎంకే మాజీ ఎమ్మెల్యే వైద్యలింగం, అనకాపుత్తూరు తెలుగు ప్రముఖుడు భారతి కుమార్‌ వంటి వారు ఆయనతో సన్నిహితంగా ఉండేవారు. వైఎస్సార్‌ సేవాదళ్‌ తమిళనాడు అధికార ప్రతినిధి శ్రీదేవి రెడ్డి కూడా దాసరి మృతికి సంతాపం తెలిపారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చిత్రను ‘అమ్మ’పేరుతో సినిమాగా తెరకెక్కించడానికి దాసరి సన్నాహాలు చేశారు. ఆ ప్రయత్నం నెరవేరకుండానే తనువు చాలించడం తమిళ ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది.
 
నా చిత్రాలకు గోరింటాకు పండించారు
‘నా చిత్రాలకు గోరిటాకు పండించారు. ఆయన లేని తెలుగు సినిమాను ఊహించలేం. ఆయన నిర్మాతల్లో నాకు ప్రత్యేకతను ఇచ్చారు. నేను తెలుగు చలన చిత్ర నిర్మాతల పుస్తకాన్ని రాసినప్పుడు ఎంతోమంది అడ్డుకున్నా నాకు అండగా నిలబడ్డారు. తెలుగు నిర్మాతల చరిత్ర ఉన్నంతకాలం నేనుండేలా చేశారు. అలాంటి దాసరి మరణం తీరని లోటు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.’
– నిర్మాత మురారి
 
‘కటకటాల రుద్రయ్య’తో నా అనుబంధం
‘కటకటాల రుద్రయ్య సినిమాకు ఫైనాన్షియర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా దాసరితో పనిచేసి అనుభవం మరువలేనిది. ఆర్యవైశ్య సమావేశాలకు తరచూ హాజరై అండగా నిలిచారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు.’
– టంగుటూరి రామకృష్ణ, తెలుగు తెర అధ్యక్షుడు  
మరిన్ని వార్తలు