సినీ దిగ్గజానికి కన్నీటి వీడ్కోలు

1 Jun, 2017 01:18 IST|Sakshi
సినీ దిగ్గజానికి కన్నీటి వీడ్కోలు

► అధికార లాంఛనాలతో దర్శకరత్న దాసరి నారాయణరావు అంత్యక్రియలు పూర్తి
► చితికి నిప్పంటించిన పెద్ద కుమారుడు ప్రభు.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు
► దాసరి అంతిమయాత్రకు వెల్లువలా జనం..


సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు, నిర్మాత దాసరి నారాయణరావు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, అశేష ప్రజానీకం కన్నీటి వీడ్కోలు నడుమ బుధవారం మొయినాబాద్‌లోని తోలుకట్టలోని ఆయన ఫాంహౌస్‌ పద్మ గార్డెన్స్‌లో అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దాసరి పద్మ సమాధి పక్కన ఏర్పాటు చేసిన చితిపై దాసరి భౌతిక కాయాన్ని ఉంచారు. పెద్ద కుమారుడు తారక హరిహర ప్రభు చితికి నిప్పంటించారు. పోలీసులు గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరయ్యారు. అంత్యక్రియల్లో పాల్గొన్న దాసరి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. దాసరి కుమారులు ప్రభు, అరుణ్, కుమార్తె సౌభాగ్య, మనుమలు, మనవరాళ్లు కంటతడి పెట్టడం అందరినీ కలచివేసింది.

భారీ ప్రదర్శనగా అంతిమయాత్ర
ప్రజల సందర్శనార్థం బుధవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ దాసరి పార్థివదేహాన్ని ఆయన నివాసం వద్ద ఉంచారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఫిలింఛాంబర్‌కు ప్రదర్శనగా తరలించారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఫిలించాంబర్‌లో ఉంచిన అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది. పద్మాలయా స్టూడియో, గచ్చిబౌలి, ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీదుగా మొయినాబాద్‌ చేరుకుంది. అభిమానులు, రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

జనసంద్రమైన ఫిలింనగర్‌..
సినీప్రపంచానికి ఆత్మీయ బంధువైన దాసరికి సినీలోకం కడసారి నీరాజనాలు పలికింది. దాసరిని కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి ఫిలించాంబర్‌ వరకు జనసముద్రాన్ని తలపించింది. ఎవరికి ఎలాంటి సమస్య ఎదురైనా నేనున్నానంటూ భరోసానిచ్చి వారి సమస్యను పరిష్కరించే దాసరి లేని లోటు ఊహించ లేకపోతున్నామని పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు.

నివాళులర్పించిన ప్రముఖులు...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, పరకాల ప్రభాకర్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌.జైపాల్‌రెడ్డి, వి.హనుమంతరావు, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, డి.శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ నేతలు రోజా, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్‌ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్, అంజన్‌ కుమార్‌ యాదవ్, కాజా సూర్యనారాయణ, టీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, నన్నపనేని రాజకుమారి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తదితరులు దాసరి పార్థివదేహానికి నివాళులర్పించారు.

సినీ ప్రముఖులు కృష్ణ, విజయనిర్మల, మోహన్‌బాబు, పవన్‌కల్యాణ్, ప్రకాశ్‌రాజ్, తనికెళ్ల భరణి, కె.విశ్వనాథ్, మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ ప్రసన్న, జూనియర్‌ ఎన్టీఆర్, త్రివిక్రమ్, అల్లు అర్జున్, ఆది పినిశెట్టి, నాజర్, పరుచూరి గోపాలకృష్ణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, అలీ, హేమ, ‘మా’అధ్యక్షుడు శివాజీరాజా, రాజేంద్రప్రసాద్, కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, బోయపాటి శ్రీను, దిల్‌రాజు, ఆర్‌.నారాయణమూర్తి, శ్రీకాంత్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, ఉత్తేజ్, సుమ, రాజీవ్‌ కనకాల, సుద్దాల అశోక్‌తేజ, గద్దర్‌ తదితరులు దాసరికి కన్నీటి వీడ్కోలు పలికారు. డి.సురేశ్‌బాబు, సి.కళ్యాణ్‌ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించారు.

దాసరి ఒక వ్యవస్థ: చంద్రబాబు
దాసరి వ్యక్తి కాదని, ఓ వ్యవస్థ అని, ఆయనలేని లోటు పూడ్చలేనిదని చంద్రబాబు అన్నారు. బడుగు బలహీనవర్గాలకు ఆయన అండగా నిలిచారని, సినీకార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. సినీ రంగంలో ప్రతి ఒక్కరికీ అండదండలను అందజేసిన దాసరి మృతిని జీర్ణించుకోలేకపోతున్నట్లు రోజా, అంబటి తెలిపారు. దాసరి లేని లోటు తమకు పూడ్చలేనిదని ఉత్తమ్‌ అన్నారు. దాసరి మృతిపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తమ సంతాప సందేశాన్ని పంపారు. దాసరి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

భార్య సమాధి పక్కనే..
దాసరి 15 రోజులకొకసారి, పండుగలప్పుడు ఫాంహౌస్‌కు వచ్చేవారని ఫాంహౌస్‌ మేనేజర్‌ మధుసూదన్‌రావు తెలిపారు. ఆయన వచ్చినప్పుడల్లా తన సమాధిని భార్య పద్మ సమాధి పక్కనే ఏర్పాటు చేయాలని చెప్పేవారన్నారు.
 

మరిన్ని వార్తలు