దావూద్కి కుచ్చుటోపీ పెట్టిన అనుచరుడు

12 Sep, 2016 08:01 IST|Sakshi
దావూద్కి కుచ్చుటోపీ పెట్టిన అనుచరుడు

న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మోసపోయాడు. అది కూడా తన అనుచరుడి చేతిలో. దావూద్ కి నమ్మకస్తుడైన ఖలీక్ అహ్మద్ అనే అనుచరుడు భారీ మొత్తంలో డాన్ డబ్బును దోచేశాడు. దావూద్ భారత్ లో కేవలం ఆయుధాలు, వజ్రాలు, డ్రగ్స్ లను అక్రమంగా రవాణా చేయడమే కాకుండా నల్లధనానికి సంబంధించిన బిజినెస్ లు నడుపుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి నల్లడబ్బును  పెద్ద మొత్తంలో పనామా, కెనడా, దుబాయ్, పాకిస్తాన్ లకు హవాలా ద్వారా తరలిస్తున్నాడు. కొద్ది సంవత్సరాల తర్వాత అదే డబ్బును మామూలుగా చలామణి చేయడానికి సహకరిస్తున్నాడు.

ఈ ప్రక్రియలో అహ్మద్ ఢిల్లీలోని ఓ వ్యక్తి నుంచి రూ.45 కోట్ల రూపాయల నల్లధనాన్ని డాన్ తరఫున తీసుకోని హవాలా ద్వారా విదేశాలకు తరలించాల్సి వుంది. డబ్బును వ్యక్తి నుంచి తీసుకున్న అహ్మద్ సర్వీసు చార్జీ కింద దావూద్ కు రూ.5 కోట్లు పంపి, మిగిలిన రూ.40 కోట్లతో విదేశాలకు ఉడాయించాడు. భారత నిఘా సంస్థలు కొన్ని అంతర్జాతీయ నంబర్లను ట్యాప్ చేయగా ఈ వివరాలు బయటపడ్డాయి. పాకిస్తాన్ లో దావుద్ అనుచరుడు జబీర్ మోతి అనే వ్యక్తి అహ్మద్ కు ఫోన్ చేసి డీల్ కు సంబంధించిన వివరాలు మాట్లాడినట్లు ఓ అధికారి వెల్లడించారు.

దావూద్ పనులను చక్కబెట్టేందుకు అహ్మద్ తరచూ భారత్, షార్జాల మధ్య తిరుగుతుంటాడని తెలిసింది. అహ్మద్ చేసిన పనివల్ల డాన్ ప్రతిష్టకు భంగం కలుగుతుందని, దీనిపై దావూద్ చాలా సీరియస్ గా ఉన్నారని ఆ ఫోన్ కాల్ సారాంశం. అహ్మద్ ను పట్టుకోవడానికి నవంబర్ 26, 2015న దావూద్ అనుచరులు ఇద్దరు ఢిల్లీ నుంచి కెనడా వెళ్లినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అహ్మద్ ప్రస్తుతం మణిపూర్ లో తలదాచుకుంటున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం ఉంది. మోసగించిన డబ్బులో సగాన్ని అహ్మద్ పనామా బ్యాంకులో , మిగతా సగం డబ్బును విదేశాల్లో దావూద్ కు ఉన్న వ్యాపారాల్లో తన పేరు మీద పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు