తమ్ముడు దూసుకొచ్చేశాడు

14 Sep, 2016 19:52 IST|Sakshi
తమ్ముడు దూసుకొచ్చేశాడు

భారతదేశ టెలికాం రంగంలో మరో సంచలనానికి తెర లేచింది. దేశీయ టెలికాం రంగంలో అతి పెద్ద కార్పోరేట్ విలీనానికి ఇరు సంస్థలు అంగీకారం తెలిపాయి.  ఎప్పటినుంచో చర్చల్లో ఉన్న  విలీనం  అంశం చివరికి పట్టాలెక్కింది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ (57)కి చెందిన రిలయన్స్  కమ్యూనికేషన్స్ లో  ఎయిర్ సెల్ విలీనం కానుంది.  ఇందుకు సంబంధించిన ప్రకటనను  బుధవారం వెల్లడించాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్, మలేషియా మాక్సిస్ కమ్యూనికేషన్స్  రెండూ బోర్డు మరియు కమిటీలలో సమాన ప్రాతినిధ్యంతో 50 శాతం వాటాను కలిగి ఉండేలా డీల్ కుదుర్చుకున్నాయి.   ఎయిర్ సెల్ ను విలీనం చేసుకోవడం ద్వారా 4జీ సేవల్లో తనదైన ముద్ర వేసి, భారత్ లో నంబర్ వన్ టెలికాం సంస్థగా ఆర్ కాం నిలిచేందుకు  యోచిస్తోంది. అలాగే 'మెర్జ్ డ్ కో' పేరుతో ఈ  సంస్థ ప్రాచుర్యం లోకి రానుంది. ఇది  రూ .35,000 కోట్ల( 5.2 బిలియన్ డాలర్లు)  నికర విలువతో, రూ 65,000 కోట్లు (9.7 బిలియన్ డాలర్లు ) విలువైన ఆస్తులు కలిగి ఉంటుంది.

ఈ ఒప్పందం ప్రకారం  రిలయన్స్ కమ్యూనికేషన్స్ వైర్‌లెస్ బిజినెస్‌ను విడదీసి ఎయిర్‌సెల్‌లో విలీనం చేయనుంది. రెండు సంస్థలూ తమకు ఉన్న రూ. 14000 కోట్ల భారాన్ని నూతన సంస్థకు బదలాయిస్తాయి..  అలాగే  రిలయన్స్ కమ్యూనికేషన్ అప్పు  రూ. 20 వేల కోట్ల వరకూ తగ్గనుంది.  తాజా విలీనంతో 19 కోట్ల మంది  ఖాతాదారులతో వాటాదారుల పరంగా మూడవ అతి పెద్ద టెలికాం సంస్థగా ఆర్ కాం అవతరించనుంది. అలాగే 2జీ, ౩జీ, 4జీ సేవలను అందించేందుకు ఆర్ కాంకు సులభం కానుంది. 9.87 కోట్ల చందాదారులతో ఆర్ కాం నాలగవ అతిపెద్ద సంస్థగా ఉండగా,  ఎయిర్ సెల్ 8.8కోట్ల ఖాతాదారులతో ఆరవ  స్థానంలో ఉంది. ప్రస్తుత ఈ ఒప్పందం ప్రకారం మరో ప్రముఖ టెల్కో ఐడియా ను వెనక్కి నెట్టి   'మెర్జ్ డ్ కో' మూడవ  స్థానానికి ఎగ బాకనుంది.  మార్కెట్  లీడర్  గా భారతి ఎయిర్ టెల్ ఉండగా, వోడాఫోన్ రెండవ స్థానంలో ఉంది.
ఇరు సంస్థల వాటాదారుల గణనీయమైన దీర్ఘకాల విలువను సృష్టించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని  అనిల్  అంబానీ  ప్రకటించారు.  క్యాపిటల్ వ్యయం ( కేప్ఎక్స్), ఆపరేటింగ్ వ్యయం(ఓపెక్స్)  రూ .20,000 కోట్లుగా అంచనా వేస్తున్నట్టు తెలిపారు.   ఈ   ఉమ్మడి స్పెక్ట్రం ఒప్పందం 2033-35 వరకు  అమల్లో ఉంటుందన్నారు.

కాగా  జియో సంచలనం తర్వాత  టెలికాం రంగంలో   తీవ్రమైన పోటీ నెలకొన్న  నేపథ్యంలో ఇది మరింత కన్సాలిడేట్ అవుతుందని  విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు