బీర్‌ సీసాల నుంచి బీచ్‌ శాండ్‌

5 Mar, 2017 01:46 IST|Sakshi
బీర్‌ సీసాల నుంచి బీచ్‌ శాండ్‌

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇసుకకు భలే చిక్కు వచ్చిపడిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇసుక అక్రమ రవాణా విషయంలోనే ఓ మహిళా ఎమ్మార్వో... ఎమ్మెల్యే చేతిలో అవమానాలకు గురికావాల్సి వచ్చింది. అంతకుముందు కూడా ఇసుక తిన్నెల హక్కుల కోసం గొడవలు జరిగిన ఘటనలూ ఉన్నాయి. ఇంతకీ ఈ ప్రస్తావన అంతా ఎందుకూ అంటే... న్యూజీల్యాండ్‌లోనూ ఇసుక మాయమైపోతోందట. కాకపోతే అక్కడ సమస్య సముద్ర తీరంలోని బీచ్‌శాండ్‌ కోసం. ఇక్కడ మనం నదుల ఇసుకను భవన నిర్మాణానికి వాడుతూంటే.. ప్రపంచవ్యాప్తంగా బీచ్‌శాండ్‌ను ఫార్మా రంగం నుంచి సిలికా తయారీ వరకూ అనేకచోట విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఈ చిక్కు సమస్యకు ఓ వినూత్న పరిష్కారాన్ని కనుక్కుంది న్యూజీలాండ్‌కు చెంది ఆల్కహాల్‌ కంపెనీ ‘డీబీ ఎక్స్‌పోర్ట్‌’.

ఫొటోలో కనిపిస్తున్న డబ్బాను చూశారు కదా... అందులో మద్యం బాటిల్‌ ఆకారంలో చిన్న కంత కనపడుతోందా? ఖాళీ చేసిన బాటిళ్లను ఈ కంతలో పడేస్తే చాలు... కేవలం ఐదంటే ఐదు సెకన్లలో అది ఇసుక వంటి పదార్థంగా మారిపోయి పక్కనున్న డబ్బాలో పడిపోతుంది. డీబీ ఎక్స్‌పోర్ట్‌ ఇలా సేకరించిన ఇసుకను నిర్మాణ కంపెనీలకు సరఫరా చేస్తోంది. ఇసుకగా మార్చే ముందు... ఈ మెషీన్‌లో బాటిల్‌పై ఉన్న ప్లాస్టిక్, కాగితం వంటివాటిని తీసేస్తారు. అన్నట్టు ఇంకో విషయం... ఈ డీబీ ఎక్స్‌పోర్ట్‌ కంపెనీ ఇలాటి వినూత్నమైన ఆలోచన చేయడం ఇదే మొదటిసారి కాదు.. కొంత కాలం క్రితం తమ ఫ్యాక్టరీల్లో వ్యర్థంగా మిగిలిపోతున్న మొలాసిస్‌ను సద్వినియోగం చేసుకునేందుకు సొంతంగా పరిశోధన చేపట్టి విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ కంపెనీ మొలాసిస్‌ను ‘బ్రూట్రోలియం’ పేరుతో బయోడీజిల్‌గా మార్చి వాడుతోంది!  
 – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌


 

మరిన్ని వార్తలు