పట్టువీడని అధికార, విపక్షాలు

6 Aug, 2015 00:37 IST|Sakshi
పట్టువీడని అధికార, విపక్షాలు

ఉభయ సభల్లో తొలగని ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ కొనసాగింపు.. పలు విపక్షాల వాకౌట్లతో పార్లమెంటు ఉభయసభలూ బుధవారం కూడా హోరెత్తాయి.  లోక్‌సభ ప్రారంభం కాగానే ఎన్‌సీపీ, ఎస్పీ, ఆర్జేడీ సభ్యులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలోనే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వారు చేసిన ప్రయత్నాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించటంతో మూడు పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ‘ప్రజాస్వామ్యం హత్యను ఆపండి’ అంటూ ఆర్జేడీ ఎంపీ జైప్రకాశ్ నారాయణ్ యాదవ్ అరుస్తూ వాకౌట్ చేశారు. కాగా, సస్పెండ్ కానీ కాంగ్రెస్ సభ్యులతో పాటు, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, ముస్లింలీగ్ సభ్యులు వరుసగా రెండోరోజు కూడా సభా కార్యకలాపాలను బహిష్కరించారు.

తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన అంశాన్ని టీఆర్‌ఎస్ సభ్యులు లేవనెత్తడంతో దానిపై న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య సమాధానం ఇచ్చారు. అంతకు ముందు నామినేట్ అయిన ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యులు రిచర్డ్ హే, జార్జ్ బేకర్‌లు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. మరోపక్క.. రాజ్యసభలో విపక్షాల నిరసనతో  కార్యకలాపాలు సాగనే లేదు.
 
మీ డిమాండ్లకు లొంగం: వెంకయ్య
పార్లమెంటు సమావేశాల్లో ఏ అంశంపైనైనా చర్చించేందుకు విపక్షాలకు కావలసినన్ని అవకాశాలు కల్పించడానికి  సిద్ధమని, అయితే అర్థంలేని డిమాండ్లకు ఎంతమాత్రం లొంగేది లేదని  మంత్రి  వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. యాకూబ్ ఉరిని వ్యతిరేకిస్తున్న వారిపై మండిపడుతూ.. వారికి ఉరిశిక్షల్లోనూ కోటా  కావాలేమోనని అన్నారు.

మరిన్ని వార్తలు