మరణం అనివార్యమేగా!: నారద్ రాయ్

12 Jan, 2014 12:59 IST|Sakshi
మరణం అనివార్యమేగా!: నారద్ రాయ్

న్యూఢిల్లీ: మరణం అనివార్యమైనదని, అది నిరాకరించలేనిదని ఉత్తరప్రదేశ్ క్రీడల శాఖ మంత్రి నారద్ రాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముజఫర్‌నగర్ బాధితుల సహాయక శిబిరాల్లో చిన్నారుల మరణాలపై యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ సర్కారుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతుండగా, నారద్ రాయ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ముజఫర్‌నగర్ శిబిరాల్లో చిన్నారుల మరణాలపై ప్రశ్నించగా, ‘చిన్నారులు, పెద్దలు, వృద్ధుల మరణాలు అనివార్యమైనవి. శిబిరాల్లో ఉంటున్న వారు మాత్రమే మరణిస్తున్నారనేమీ లేదు. భవంతుల్లోని వారూ మరణిస్తారు. మా ఇళ్లలో ఉంటున్న చిన్నారులు మరణించరనేమీ లేదు... మరణాలు అన్ని చోట్లా సంభవిస్తాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ముజఫర్‌నగర్‌లో మత ఘర్షణల బాధితులు తలదాచుకుంటున్న సహాయక శిబిరాల్లో గడచిన రెండు నెలల వ్యవధిలోనే 34 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఇదిలా ఉండగా, శిబిరాల్లో ఉంటున్న వారెవరూ చలికి తాళలేక మరణించడం లేదని, అదే నిజమైతే సైబీరియాలో ఎవరూ బతికి ఉండేవారే కాదని యూపీ ప్రభుత్వాధికారి ఏకే గుప్తా వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు