కారుణ్య నియామకం హక్కు కాదు: సుప్రీంకోర్టు

21 Aug, 2013 01:24 IST|Sakshi
కారుణ్య నియామకం హక్కు కాదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ప్రభుత్వోద్యోగి మరణం.. బాధిత కుటుంబానికి కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కోరే హక్కును ఇవ్వలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు కారుణ్య నియామకం కోరే సదరు వ్యక్తి ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతను కలిగి ఉండాలని కూడా న్యాయమూర్తులు బి.ఎస్.చౌహాన్, ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం తెలిపింది. బాధిత కుటుంబం ఆర్థిక స్థితిగతులన్నీ పరిశీలించిన తర్వాత.. యజమాని మరణంతో ఏర్పడిన సంక్షోభం నుంచి కుటుంబం బయటపడలేదని భావించినప్పుడు మాత్రమే అర్హుడైన కుటుంబ సభ్యుడికి ఉద్యోగావకాశం కల్పించాలని పేర్కొంది.
 
 ఈ మేరకు రాజస్థాన్‌లోని ఎంజీఎం గ్రామీణ బ్యాంకు దాఖలు చేసిన అప్పీల్‌ను బెంచ్ అనుమతించింది. ఎంజీఎం ఉద్యోగి ఒకరు మరణించినప్పుడు అతని కుమారుడు చక్రవర్తి సింగ్‌కు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా 2010లో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సదరు బ్యాంక్ సుప్రీంలో సవాల్ చేసింది. చక్రవర్తికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేందుకు హైకోర్టు సింగిల్ జడ్జితో పాటు, డివిజన్ బెంచ్ పేర్కొన్న కారణాలు చట్టం ముందు నిలువజాలవని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

మరిన్ని వార్తలు