ప్రాణాలు పోతున్నా పట్టదా?

12 Feb, 2017 12:29 IST|Sakshi
ప్రాణాలు పోతున్నా పట్టదా?

పెద్దాస్పత్రుల్లో వైద్యులు, అధికారుల నిర్లక్ష్యం.. పేద రోగులకు సరిగా అందని చికిత్స
- వైద్యం అందించడంలో అలసత్వం
- రోగులకు పురుగులు, బ్యాక్టీరియాలున్న సెలైన్లు
- ఆక్సిజన్‌ వంటి అత్యవసర ఏర్పాట్లనూ పట్టించుకోని వైనం
- సరోజినీ కంటి ఆస్పత్రి నుంచి నిలోఫర్‌ వరకు అదే తీరు
- నిలోఫర్‌ ఆస్పత్రిలో మరణ మృదంగం
- గత 17 నెలల్లో 21,345 మంది పిల్లలు చేరితే.. 3,502 మంది మృతి
- బాధ్యులపై తూతూమంత్రపు చర్యలకే సర్కారు పరిమితం
- సరోజినీ ఆస్పత్రి ఘటనపై ఇప్పటికీ చర్యలు శూన్యం


సాక్షి, హైదరాబాద్‌
నిలోఫర్‌ ఆస్పత్రిలో వారం వ్యవధిలో సిజేరియన్‌ శస్త్రచికిత్స వికటించి ఐదుగురు బాలింతల మృతి..
గాంధీ ఆస్పత్రిలో పురుగులున్న సెలైన్‌ ఎక్కించడంతో సాయి ప్రవళిక అనే చిన్నారి మరణం..
ఇటీవలే ఉస్మానియా ఆస్పత్రి న్యూరో సర్జరీ వార్డులో ఆక్సిజన్‌ సరిగా అందక కన్ను మూసిన నలుగురు రోగులు..
గతేడాది సరోజినీ కంటి ఆస్పత్రిలో సెలైన్‌లో బ్యాక్టీరియా కారణంగా 13 మందికి ఇన్‌ఫెక్షన్‌ సోకి.. ఐదుగురు శాశ్వతంగా ఒక కన్ను కోల్పోయారు.


రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో జరిగిన సంఘటనలు ఇవి. రోగం తగ్గిస్తారని ఈ ఆస్పత్రులకు వెళితే.. కొత్త బాధలు తెచ్చిపెడుతున్నారు. ప్రాణాలు నిలబెడతారని వెళితే.. పాడెపైకే పంపేస్తున్నారు.

ఆస్పత్రిలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణం. వైద్యం కోసం వచ్చే పేద రోగులకు సరైన చికిత్స అందకపోగా ప్రాణాలకే రక్షణ లేకుండాపోవడం ఆందోళనకరంగా మారింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నామమాత్రపు చర్యలతోనే సరిపెడుతుండడంతో దారుణాలు మరింతగా పెరిగిపోతున్నాయి. వరుసగా ఘటనలు జరుగుతున్నా ఈ నాలుగు ఆసుపత్రులకు చెందిన ఏ ఒక్క అధికారిపైనా తగిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. నీలోఫర్‌లో తాజాగా అక్కడి సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోలను సరెండర్‌ చేసి వదిలేశారు. సస్పెన్షన్‌ వంటి చర్యలు ఎందుకు తీసుకోలేదన్న చర్చ జరుగుతోంది.

బోధనాసుపత్రుల్లో దారుణం
సరోజినీ, నీలోఫర్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులన్నీ కూడా బోధనాసుపత్రులే. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా వీటిని నిర్వహిస్తున్నారు. వైద్య విద్యా డైరెక్టర్‌ (డీఎంఈ) పరిధిలో కొనసాగుతున్న ఈ ఆస్పత్రుల నిర్వహణ రాష్ట్ర స్థాయి వైద్యారోగ్యశాఖ వర్గాల కనుసన్నల్లో ఉంటుంది. గతేడాది సరోజినీ కంటి ఆస్పత్రిలో కంటి ఆపరేషన్‌ సందర్భంగా బ్యాక్టీరియా ఉన్న సెలైన్‌ను వాడారు. దాంతో ఐదుగురు ఒక కంటిని శాశ్వతంగా కోల్పోయారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సెలైన్లలో బ్యాక్టీరియా ఉందని నిర్ధారణ జరిగింది, తప్పు జరిగిందని ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. బాధ్యులపై చర్యలు మాత్రం తీసుకోలేదు. సెలైన్‌లను సరఫరా చేసిన కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టి వదిలేశారు. కానీ ఆ కంపెనీ గత చరిత్ర చూసుకోకుండా టెండర్లు ఇచ్చిన అధికారులపైగానీ.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపైగానీ ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు చేపట్టలేదు. ఆ ఘటనలో రాష్ట్ర వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) అధికారులెవరూ బాధ్యులు కారా? కేవలం కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టి వదిలేస్తే సరిపోతుందా? ఆ కంపెనీ నుంచి బాధితులకు కనీసం పరిహారం ఇప్పించలేరా? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలు లేవు.

ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు
గాంధీ ఆస్పత్రిలో ఇటీవల సాయి ప్రవళిక మరణం నిర్లక్ష్యానికి పరాకాష్ట. అందులో తమ తప్పు లేదంటూ అక్కడి అధికారులు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిసింది. దాంతో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలే లేవు. బాధిత తండ్రిదే తప్పన్నట్లుగా ప్రభుత్వం భావిస్తోంది. ఇలా నిర్లక్ష్యపు అధికారులను ప్రభుత్వం వెనకేసుకు రావడంతో తమకేం ఫర్వాలేదన్న భావన ఆస్పత్రి వర్గాల్లో నెలకొందన్న వాదన ఉంది. ఉస్మానియా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక నలుగురు చనిపోయినా.. అక్కడి సిబ్బంది నివేదికను ఆధారం చేసుకుని ప్రభుత్వం తప్పేం జరగలేదన్న భావనకు వచ్చింది.

నెలకు సగటున 200 మంది చిన్నపిల్లలు మృతి
నీలోఫర్‌ ఆస్పత్రిలో గత వారం రోజుల్లో ఐదుగురు బాలింతలు మరణించడం సంచలనం కలిగించింది. అక్కడి ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట. గత నెల 28న ఒక బాలింత మృతి చెందితే ఆ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారే కానీ... తిరిగి అలాంటివి జరగకుండా చర్యలు చేపట్టలేదు. దాంతో మరో నలుగురు మరణించారు. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు కూడా ఈ విషయం తెలియకుండా కప్పిపుచ్చారు. వైద్యులు నిర్లక్ష్యంగా ఆపరేషన్‌ చేయడం వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలున్నాయి. తగిన చర్యలు లేకపోవడంతోనే ఆస్పత్రి వర్గాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలున్నాయి.

ఎందుకు ఉపేక్షించారు?
నీలోఫర్‌ ఆస్పత్రి గైనిక్‌ వార్డులో సిబ్బంది కొరత ఉంది. దానికితోడు ఇద్దరు ప్రొఫెసర్లు దీర్ఘకాలిక సెలవుపై విదేశాలకు వెళ్లారు. అసలు దీర్ఘకాలిక సెలవులకు ఎలా అనుమతి ఇచ్చారు? వారికి అనుమతి ఇచ్చిన అధికారులను ఎందుకు వదిలేస్తున్నారనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఇక ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు సదభిప్రాయమే లేదని చెబుతున్నారు. అంటే నిర్లక్ష్య పూరితంగా ఉంటారని మొదటి నుంచీ తెలిసినా ఎందుకు ఉపేక్షించారనే సందేహం తలెత్తుతోంది.

ఇంత మంది చనిపోతున్నా..
నీలోఫర్‌లో సగటున నెలకు 205 మంది చిన్న పిల్లలు మృత్యువాత పడుతున్నారు. 2015 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు 15,378 మంది చిన్నపిల్లలు నీలోఫర్‌ ఆస్పత్రిలో చేరగా... అందులో ఏకంగా 2,411 మంది చనిపోవడం ఆందోళనకరం. అలాగే గతేడాది జనవరి నుంచి మే వరకు ఐదు నెలల్లో 5,967 మంది వైద్యం కోసం చేరగా.. 1,091 మంది చిన్న పిల్లలు చనిపోయారని ఆస్పత్రి నివేదికలే చెబుతున్నాయి. 2015లో వైద్యం కోసం వచ్చిన చిన్నారుల్లో 15 శాతం, గతేడాది 18 శాతం చిన్నారులు మృత్యువాత పడ్డారంటే నీలోఫర్‌ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగే వాటికి నేరుగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సంబంధం ఉండదని ఓ ప్రముఖ వైద్యుడు పేర్కొన్నారు. ఆస్పత్రుల స్థాయిలోనే సూపరింటెండెంట్లు చర్యలు తీసుకోవాలని... కానీ అలా జరగడం లేదని చెప్పారు. దీనిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు.

చర్యలు తీసుకుంటాం: లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
‘‘నీలోఫర్‌ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఇటువంటివి ఎక్కడ జరిగినా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. కలెక్టర్‌ నివేదిక ఇచ్చాక తదుపరి చర్యలుంటాయి. ప్రభుత్వ వైద్యం పేదలకు సక్రమంగా అందేలా చర్యలు చేపడుతున్నాం..’’

మరిన్ని వార్తలు