సీత జన్మస్థలంపై పార్లమెంట్‌లో రగడ

12 Apr, 2017 21:59 IST|Sakshi
సీత జన్మస్థలంపై పార్లమెంట్‌లో రగడ

- ఆధారాల్లేవు.. ఇది విశ్వాసాలకు సంబంధించిన అంశం
- కేంద్ర మంత్రి మహేశ్‌ శర్మ ప్రకటన.. రాజ్యసభలో రగడ


న్యూఢిల్లీ:
సీత జన్మించిన ప్రాంతం మన విశ్వాసాలకు సంబంధించిన విషయమని కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేశ్‌ శర్మ రాజ్యసభలో పేర్కొనడం పట్ల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి చారిత్రక ఆధారాలు లేవని ప్రతిపక్షం పేర్కొంది. అయితే శర్మ తన సమాధానాన్ని సమర్థించుకున్నారు. సీత జన్మించిన ప్రాంతంపై సందేహాలు అక్కర్లేదని, ఆమె మిథిలలో జన్మించినట్లు వాల్మీకి రామాయణంలో ఉందని తెలిపారు.

బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎంపీ ప్రభాత్‌ ఝా బిహార్‌లోని సీతామర్హి ప్రాంత(సీత జన్మించినదిగా భావిస్తున్న చోటు) అభివృద్ధి గురించి వివరాలు కోరిన సందర్భంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. సీతామర్హి జిల్లాలో ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఎలాంటి తవ్వకాలు చేపట్టలేదని కాబట్టి ఆ ప్రాంతంలో సీత జన్మించిందని అనడానికి చారిత్రక ఆధారాలు లేవని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. సీతారాముల స్వయంవరానికి సంబంధించిన ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా? అని వ్యగ్యంగా ప్రశ్నించారు.

రాముడికి చెడ్డపేరు తేవొద్దు: తృణమూల్‌ కాంగ్రెస్‌
పశ్చిమ బెంగాల్‌లో శ్రీరామనవమి సందర్భంగా బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఆయుధాలు ప్రదర్శిండం పట్ల తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజ్యసభలో నిరసన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలతో రాముడికి అపకీర్తి తేవొద్దని కేంద్రాన్ని కోరింది. రామనవమి లాంటి పవిత్ర దినాన శాంతి, ప్రేమను ప్రచారం చేయడానికి బదులు ఆయుధాలు పట్టేలా యువతను ప్రోత్సహించడం తాలిబన్‌ సంస్కృతిని పోలినట్లు ఉందని పేర్కొంది.

మరిన్ని వార్తలు